
వ్యవస్థల నిర్విర్యంతో ప్రజాస్వామ్యం అపహాస్యం
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలో టీడీపీ గూండాగిరి
ఘోర పరాజయం తప్పదని అక్రమ కేసులకు తెరతీసిన వైనం.. పోలీసు వ్యవస్థ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలు
వందలాది మందిపై బైండోవర్, తప్పుడు కేసులు
టీడీపీ మూక దాడుల్లో బాధితులు 50 మందిపైనే రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు
పులివెందులలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ మరో 150 మందిపై కేసు
పోలింగ్ నాటికి వీరందరినీ అక్రమ అరెస్టుల ద్వారా నిర్బంధించే కుట్ర.. డీజీపీ కనుసన్నల్లోనే పూర్తిగా దిగజారిపోయిన పోలీసు వ్యవస్థ
ఎన్ని ఫిర్యాదులొచ్చినా పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్న ఎస్‌ఈసీ.. ఎన్ని చేసినా ఫలితం కనిపించక పోలింగ్ బూత్‌ల మార్పు
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి.. రిగ్గింగ్ చేసుకోవాలని టీడీపీ కుతంత్రం
సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యయుతంగా గెలవడం అసాధ్యమని ఆదిలోనే గ్రహించిన సీఎం చంద్రబాబు తొక్కని అడ్డదారులు లేవు.. సామ దాన భేద దండోపాయాలను వాడిగా ప్రయోగించినా విజయం దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామనే దుగ్ధతో అరాచకాలకు మరింతగా పదును పెట్టారు. కాలకేయులు.. పిండారీలు.. బందిపోట్లను మరిపించే గూండాలతో కూడిన టీడీపీ మూక, రౌడీ గ్యాంగ్‌కు కొమ్ముకాసే కొంత మంది పోలీసు అధికారులను ముఠాగా ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియను హైజాక్ చేసే కుట్రకు తెర తీశారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సానుభూతిపరులపై అత్యంత కిరాతకంగా పాశవికంగా దాడులు చేసి, దౌర్జన్యం చేసి పోలింగ్ శాతాన్ని తగ్గించడం– పోలింగ్ బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకోవడం, ఈ అరాచకకాండ బయటకు తెలియ నీయకుండా చేసేందుకు మీడియాను కూడా పోలీసులతోనే కట్టడి చేయిస్తున్నారు. దేశ చరిత్రలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఈ స్థాయిలో వికృత దాడులు, దౌర్జన్యాలు.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన దాఖలాలు లేవంటూ సీనియర్ రాజకీయ నేతలు నివ్వెరపోతున్నారు.
14 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం సీఎం చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడం.. ఆ రెండు స్థానాల్లో టీడీపీ ఘోర పరాజయం పొందడం ఖాయమని తాను నిర్వహించిన అంతర్గత సర్వేల్లో తేలి పోవడంతో సీఎం చంద్రబాబు విద్యార్థి దశ నుంచే అలవర్చుకున్న రౌడీ రాజకీయానికి మరింత పదునుపెట్టారు.
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆ మండలాల్లోనే వైఎస్సార్‌సీపీ కీలక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలపై సీఎం చంద్రబాబు పోలీసులను ఉసిగొలిపి బైండోవర్ కేసులు పెట్టించారు. వందల కొద్దీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెరకపోవడంతో.. కోట్ల కట్టలను వెదజల్లి ప్రలోభపెట్టి లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. ప్రలోభపర్వం కూడా బెడిసికొట్టడంతో దౌర్జన్యకాండకు తెరతీశారు. సీఎం చంద్రబాబు రచించిన పథకం మేరకు.. ఆగస్టు 5న పులివెందులలో ఓ పెళ్లికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గూండాలు వికృతంగా దాడి చేశారు.
ఆగస్టు 6న నల్లగొండువారిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత రమేష్ యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నం చేయించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఈ దాడి కళ్లెదుటే జరుగుతున్నప్పటికీ ప్రేక్షక ప్రాత వహించారు. పోలీసులు అధికార టీడీపీకి ఏకపక్షంగా వత్తాసు పలుకుతుండటం అడుగడుగునా కనిపిస్తోంది. ఏకంగా డీజీపీ కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అరాచకం, రౌడీయిజం, పోలింగ్ బూత్‌ల మార్పిడిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిద్ర నటిస్తుండటం దుర్మార్గం.
ఓటింగ్ క్యాప్చర్ లక్ష్యం
⇒ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే అధికారులు వైఎస్సార్‌సీపీ ఓట్లను తగ్గించేందుకు గ్రామాల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఒక ఊరిలోని ఓటర్లు మరో ఊరికి వెళ్లి ఓటు వేసేలా సరికొత్తగా ‘జంబ్లింగ్’ విధానాన్ని తీసుకొచ్చి లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామాల ప్రజలు ఓటేయడానికి వెళ్లనివ్వకుండా బెదిరించడం, భౌతికదాడులకు పాల్పడి భయపెట్టడం, తద్వారా పోలింగ్ శాతాన్ని తగ్గించడం, రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పన్నాగం పన్నారు.
⇒ మరోవైపు ప్రచారం ముగియడంతో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు గుంపగుత్తగా ఓట్లు కొనేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. ఇంత దారుణం జరుగుతుంటే సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌లు ప్రకటించారు. ఇప్పటికే ఓటర్లు స్లిప్పులు 95 శాతం పంపిణీ చేశామని చెప్పారు. వాస్తవానికి స్లిప్పులు ఓటర్లకు చేరలేదు.
⇒ ఎన్ని అక్రమాలు చేసినా విజయ సూచనలు ఏమాత్రం కనిపించక పోవడంతో అరెస్టులు, దౌర్జన్యాలపై టీడీపీ పెద్దలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తప్పుడు ఫిర్యాదుతో నల్లగొండుగారిపల్లిలో జరిగిన దాడిలో బాధితులపైనే వేల్పుల రాము సహా 50 మందిపై రివర్స్‌లో ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని.. పోలింగ్ రోజున వారంతా ఉండకుండా అరెస్టులకు ఉపక్రమించారు. తద్వారా పోలింగ్ ప్రక్రియను టీడీపీ గూండాలు హైజాక్ చేసేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు.
⇒ టీడీపీ నేతల దాడులకు నిరసనగా పులివెందులలో వైఎస్సార్‌సీపీ చేసిన శాంతి ర్యాలీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనంటూ మరో 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గోటూరు చిన్నప్పలకు నోటీసు జారీ చేశారు. ఇంకా వైఎస్సార్‌సీపీ నేతల వేట కొనసాగుతూనే ఉంది.
సోమవారం రాత్రి లోగా టీడీపీ పెద్దలు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసి స్వామిభక్తి చాటుకునే పనిలో కొంత మంది అధికారులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ నాటికి వైఎస్సార్‌సీపీ క్రియాశీలక నేతలెవ్వరు బయట ఉండకుండా చేయాలనే లక్ష్యం మేరకు ఏకపక్ష చర్యలు తీవ్రతరమయ్యాయి. తద్వారా పూర్తిగా టీడీపీ అనుకూల ఓటింగ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఇంతగా ఖూనీ కావడంపై.. వ్యవస్థలు నిర్వీర్యం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.