
ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ మూర్తికి వినతిపత్రం ఇస్తున్న అప్పిరెడ్డి, రమేష్‌యాదవ్
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)కి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
6 పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంపై వెంటనే జోక్యం చేసుకోండి
ఉద్దేశపూర్వకంగానే పోలింగ్ కేంద్రాల మార్పు
ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే
ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకూడదనే కుట్ర
వినతిపత్రంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి (ఈవో) నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను అసౌకర్యానికి గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను (ఎస్‌ఈసీ) కోరింది. ఈ మేరకు శుక్రవారం శాసన మండలి మాజీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్‌లు ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ మూర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
విపరీత పోకడలకు పోకుండా ప్రజస్వామ్య పద్ధతిలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిపిస్తే, ప్రజలే తగిన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘పులివెందుల జెడ్పీటీపీ ఉప ఎన్నికలో ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌లోని రెండు సెంటర్లను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు, నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్‌ను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లోని రెండు సెంటర్లను ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉన్న మరో సెంటర్‌ను నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌కు మార్చాలని ఎన్నికల అధికారి నిర్ణయించారు.
ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఓటర్లు చాలా ఇబ్బందిపడతారు. ఈ ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఎస్‌ఈసీని కోరాం. ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి. మార్చిన పోలింగ్ కేంద్రాలను చూస్తే... ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నారా? మీరెవరూ ఓటు వేయొద్దు. మేమే వేసుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాకు వర్తించదు అని చెప్పదల్చుకున్నారా? ఇక్కడున్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగం, దాని ద్వారానే ఇష్టం వచి్చనట్లు చేస్తాం? అనే ఉద్దేశంలో ఉన్నారా?.
దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎత్తేసి
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులను అధికారులు కల్పించాలి. కానీ, ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 2 కి.మీ., నల్లగొండువారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 4 కి.మీ. దూరం. గతంలో పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు దగ్గరగా ఉండేవి. ప్రజలు ఇబ్బంది లేకుండా ఓటు వేసేవారు. దూరంగా తరలించడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడతారు. దూరంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు వారంతా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని చెప్పి, ఓటు వేయనీయకుండా టీడీపీ నిరోధించే ప్రమాదం ఉంది.
ఉప ఎన్నిక ప్రచారంలో ఈ నెల 6న మా పార్టీ నాయకులపై ఏ స్థాయిలో భౌతిక దాడి జరిగిందో అందరూ చూశారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, వారు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయాలన్న కుట్రతోనే అధికార పార్టీ వారు ఈ దాడికి పాల్పడ్డారు. అందుకని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 6 పోలింగ్ కేంద్రాలను (6వ నంబరు నుంచి 11 వరకు) ఏ మార్పు లేకుండా యథాతథంగా కొనసాగేలా చూడాలి.
ఎలాగైనా గెలవాలని టీడీపీ దుశ్చర్యలు
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ వారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఖాకీ చొక్కాలను పక్కనపెట్టి పచ్చ చొక్కాలను ధరించి వైఎస్సార్‌సీపీ నాయకులను అడుగడుగునా భయపెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయినా, ప్రజలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఆలోచనతో ఏదో ఒకలా వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దాడులకు దిగుతున్నారు.
చివరికి బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రెవెన్యూ యంత్రాంగం.. ఎలాగైనా టీడీపీని గెలిపించాలని పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పనిచేస్తున్నామని నిస్సిగ్గుగా చెబుతోంది. 20 ఏళ్ల క్రితం బిహార్ లో ఉన్న పరిస్థితులను టీడీపీ ఇప్పుడు ఏపీలో తీసుకొస్తోంది.
హైకోర్టు తీర్పును గౌరవించండి
సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్, మానిటరింగ్, అభ్యర్థులకు రక్షణ, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అమలు చేయాలి. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మేం ఏనాడూ తప్పుడు పనులు చేయలేదు. ప్రజాస్వామ్యవాదులంతా రాష్ట్రంలోని అప్రజాస్వామ్యిక పాలనను గమనించాలి.