దేశ ప్రగతికి 'ఏపీ దిక్సూచి' | Sakshi
Sakshi News home page

దేశ ప్రగతికి 'ఏపీ దిక్సూచి'

Published Mon, Dec 5 2022 1:25 AM

President Draupadi Murmu was honored with civil honors in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ చోదక శక్తిగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళా సాధికారత సాధన, దేశ ప్రగతిలో ఏపీ ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమైందని చెప్పారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రాష్ట్రంలో ఆదివారం పర్యటించారు.

2 రోజుల పర్యటన కోసం వచ్చిన రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో పౌర సన్మానం చేసింది. విజయవాడ శివారులోని పోరంకిలో ఓ ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఘనంగా  సన్మానించారు.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా కూడా రాష్ట్రపతిని సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తిరుమల–తిరుపతి నుంచి దేశ ప్రజలను ఆశీర్వదిస్తున్న శ్రీవెంకటేశ్వరుడు కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు.

దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఆధునిక ప్రగతి వైపు పయనించేందుకు దేశ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ కీలక భూమిక పోషిస్తోందన్నారు. వందేళ్ల క్రితమే మానవాళికి అవసరమైన ఎన్నో ఔషధాలను సృష్టించిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావును యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.

అందుకోసం నూతన జాతీయ విద్యా విధానం–2020లో మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునిక ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించేలా కార్యాచరణను రూపొందించారని చెప్పారు. ఆధునిక సమాచార విప్లవంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ముందు వరుసలో ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా దేశ కీర్తి పతాకను ఎగుర వేస్తున్నారని ఆమె కొనియాడారు. శ్రీహరికోటలోని ఇస్రో.. అంతరిక్ష పరిశోధనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.  

దేశ భాషలందు తెలుగు లెస్స 
జీవనాడులైన నదీనదాలను సంరక్షించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు. అభివృద్ధిని, మన వారసత్వంతో జోడించే అద్భుతమైన ఘట్టం నాగార్జునసాగర్‌ నిర్మాణమని ఆమె ప్రశంసించారు. కూచిపూడి నాట్యంతో మన సంస్కృతి, సంప్రదాయాలు, భారతీయ కళాత్మక శక్తిని ఆంధ్రప్రదేశ్‌.. ప్రపంచానికి చాటడం ద్వారా ఆలంబనగా నిలుస్తోందన్నారు.
మాట్లాడుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులు తదితరులు   

‘దేశ భాషలందు తెలుగు లెస్స’గా ప్రఖ్యాతిగాంచిన తీయనైన భాషలో కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు అద్భుతమైన అభివ్యక్తీకరణ ద్వారా భారతీయ భాషల విశిష్టతను చాటి చెప్పారన్నారు. మహిళలను గౌరవించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తోందని చెప్పారు. ఐదున్నర శతాబ్దాల క్రితమే వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన కవయిత్రి మొల్ల రాసిన మొల్ల రామాయణం భారతీయ సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు.

గురజాడ అప్పారావు 125 ఏళ్ల క్రితమే రాసిన కన్యాశుల్కం నాటకం ఓ సామాజిక సంస్కరణగా ఆమె అభివర్ణించారు. వందేళ్ల క్రితమే దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ ఆంధ్ర మహిళా సభను ఏర్పాటు చేసి మహిళా సాధికారత, సమాజహితం కోసం కృషి చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కోడలైన సరోజినీనాయుడు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడంతోపాటు దేశంలో తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారన్నారు.

తాను జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులైనప్పుడు సరోజినీ నాయుడు అనుసరించిన ఆదర్శాలను పాటించాలని, ధైర్యంగా ప్రజా సేవలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇతరులతో పోలిస్తే ఆంధ్ర మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారని, భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆనాడే చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.  

అభివృద్ధి పథంలో ఏపీ పురోగమించాలి 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డిలు పాటించిన విలువలు తన కర్తవ్య పాలనలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రాష్ట్రపతి చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భాగస్వామ్యం చిరస్మరణీయమని కొనియాడారు. 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు, 25 ఏళ్ల వయసులోనే భరత మాత కోసం ప్రాణాలు అర్పించిన బిర్సాముండా వంటి వారి త్యాగాలను యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం హర్షణీయమన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల సమయంలో జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకు నివాళి అర్పించడం మన కర్తవ్యమన్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏపీ ఇలాగే అభివృద్ధి పథంలో పురోగమించాలని రాష్ట్రపతి  ఆకాంక్షించారు.  

ప్రగతిపథంలో ఆంధ్రప్రదేశ్‌ : గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి ర్యాంకు సాధించి, దేశంలో వ్యాపార అనుకూల వాతావరణానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.

రాష్ట్రపతికి పౌర సన్మాన సభలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తూ సమృద్ధికర సహజ వనరులు, నైపుణ్యవంతమైన మానవ వనరులు, దార్శనికమైన నాయకత్వం రాష్ట్రాన్ని పురోగామిపథంలో నిలుపుతున్నాయన్నారు. సాంస్కృతిక, కళా రంగాల్లో విశిష్టత చాటుతూ ఆంధ్రప్రదేశ్‌ తన ప్రత్యేకతను నిలుపుకుంటోందని చెప్పారు.

దేశంలో కీలకమైన అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని, మరింత వృద్ధి రేటును సాధించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

మహిళా సాధికారతకు రాష్ట్రపతి ప్రతిబింబం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  
మహిళా సాధికారతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిబింబమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆమె నిష్కళంకమైన రాజకీయ జీవితం, కష్టాలకు ఎదురొడ్డి మరీ అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు ప్రతి మహిళకు ఆదర్శనీయమన్నారు. రాష్ట్రపతి స్ఫూర్తితో ప్రతి మహిళా స్వయం సాధికారత సాధించాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని కాంక్షిస్తూ తమ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.


రాష్ట్రపతికి పౌర సన్మాన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ద్రౌపది ముర్ము జీవితం నుంచి రాష్ట్ర మహిళలు మరింత చైతన్యం పొందాలన్నారు. అందుకు తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాయని నమ్ముతున్నానన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..    

ప్రతి మహిళకూ ఆదర్శం 
► ఇవాళ చాలా గొప్ప రోజు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా పదవి చేపట్టడం దేశంలో ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్య వాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే ఒక గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము ఉదాత్తమైన జీవితం దేశంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.  

► రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలు ఉన్న ఏ వ్యక్తి అయినా దేశంలో ఎంతటి స్థానానికైనా చేరుకోగలరు అనేందుకు ద్రౌపది ముర్ము గొప్ప ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతారు. ఆమె జీవితంలో పడ్డ కష్టాలను చిరునవ్వుతో స్వీకరించి, సంకల్పంతో ముందుకు సాగిన తీరు ప్రతి మహిళకు ఆదర్శంగా నిలుస్తుంది.  

► ఒడిశాలో అత్యంత వెనుకబడిన మయూర్‌భంజ్‌ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించి భువనేశ్వర్‌ వెళ్లి బీఏ పూర్తి చేశారు.  

► ద్రౌపది ముర్ము గ్రామంలో డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ కావడం అప్పట్లో ఓ విశేషం. తర్వాత ఇరిగేషన్, విద్యుత్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం కౌన్సిలర్‌గా, 2000లో తొలిసారి రాయరంగపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకు అదే పదవిలో కొనసాగారు. 

► ఒడిశా ప్రభుత్వంలో వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా, స్వతంత్ర హోదాలో మత్స్య శాఖ మంత్రిగా చేశారు. ప్రజా సేవలో చిత్తశుద్ధి, కార్యదీక్ష, నిజాయితీతో ముందుకు వెళ్లి 2015లో జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత దేశ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం.. తొలిసారిగా మన రాష్ట్రానికి రావడం సంతోషం కలిగించే విషయం. 

► రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ము వన్నె తీసుకు వస్తారనడంతో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్య పటిష్టతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, దేశ ఖ్యాతిని మరింత పెంచడానికి ఆమె తప్పక దోహదపడతారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement