కరెంటుతో జాగ్రత్త!.. ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు | Precautions To Be Taken For Electrocution Accidents | Sakshi
Sakshi News home page

కరెంటుతో జాగ్రత్త!.. ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు

Nov 12 2022 10:52 AM | Updated on Nov 12 2022 11:38 AM

Precautions To Be Taken For Electrocution Accidents - Sakshi

దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు తీస్తున్న విద్యుత్‌ 

వానలు, ఈదురుగాలులతో విద్యుత్‌ వైర్లు తెగిపడే అవకాశం 

వ్యవసాయ బావుల వద్ద సరైన వైరింగ్‌ లేక ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు 

తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో 41,914 విద్యుత్‌ ప్రమాదాలు సంభవించగా.. మహారాష్ట్ర 10,698, ఉత్తరప్రదేశ్‌ 9,970, గుజరాత్‌ 3,767 ప్రమాదాలతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో అదే నాలుగేళ్లలో 2,922 ప్రమాదాలు జరిగాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్‌ ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వీటిని సైతం నివారించాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విద్యుత్‌ షాక్‌కు గరవుతున్నారు. కొన్ని జాగ్రతలు పాటిస్తే పెనుప్రమాదం నుంచి బయటపడవచ్చని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఈ జాగ్రత్తలు పాటించండి 
వ్యవసాయ పంపుసెట్లకు మోటార్‌ స్టార్టర్లు, స్విచ్‌లు ఉన్న ఇనుప బోర్డులకు విధిగా ఎర్తింగ్‌ చేయించాలి. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్‌ మోటార్లను, స్విచ్‌లను, పరికరాలను తాకకూడదు. ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతు చేయడానికి విద్యుత్‌ అర్హత గల ఎలక్ట్రీషియన్‌ను పిలిపించాలి. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ వైర్లకు దూరంగా ఉండి.. 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా సంబంధిత విద్యుత్‌ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలి. పంటను జంతువుల బారినుంచి రక్షించేందుకు పెట్టే ఫెన్సింగులకు విద్యుత్‌ సరఫరా చేయకూడదు. పాడైన విద్యుత్‌ వైర్లను ఇన్సులేషన్‌ టేపుతో చుట్టాలి. వాహనాలపై విద్యుత్‌ తీగలు తగిలితే బయట పడేందుకు హాపింగ్‌ (గెంతుట, దుముకుట) విధానం అనుసరించాలి.

అంతేతప్ప ఒక కాలు వాహనంలోనూ, మరో కాలు నేలపైనా ఉంచకూడదు. వర్షం వచ్చిన సమయంలో విద్యుత్‌ స్తంభాలను తాకరాదు. నీటిలో పడిన విద్యుత్‌ వైర్ల జోలికి వెళ్లకూడదు. స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. విద్యుత్‌ స్తంభం నుంచి వ్యవసాయ మోటారుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్‌ వైరు వదులై మోటారుపై ప్రభావం చూపుతుంది. విద్యుత్‌ స్తంభం నుంచి మోటారుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్‌ బ్యాక్, స్టార్టర్‌ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మోటార్‌ వద్ద ఫ్యూజ్‌లు, ఇండికేటర్‌ బల్బులు, స్టార్టర్‌ను చెక్కపై బిగించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుప డబ్బాపై బిగించకూడదు. భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్‌ ప్రమాదాలకు అవకాశం ఉన్నట్టు గుర్తిస్తే 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలి. 

ఇదీ చదవండి: ప్రమాదాల వేళ గోల్డెన్‌ అవర్‌లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement