దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపైనే అధిక ప్రభావం | Precautions Are The Best For High Risk People | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపైనే అధిక ప్రభావం

Jan 15 2022 4:29 PM | Updated on Jan 16 2022 9:25 AM

Precautions Are The Best  For High Risk People - Sakshi

సాక్షి, అమరావతి :  కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.. థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.. తొలిదశ నుంచీ గర్భిణులు, వృద్ధులు, క్యాన్సర్, హెచ్‌ఐవీ, కిడ్నీ సంబంధిత, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపైనే వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపుతోంది... ఈ నేపథ్యంలో ఆయా వర్గాల వారు ముందస్తుగా అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ మ్యుటేషన్లు మార్చుకుంటూ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఈసారి దాని ప్రభావం మాత్రం తగ్గుతోంది. అయినప్పటికీ హైరిస్క్‌ జోన్‌లో ఉండే వారు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంబరాలు, అదే విధంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రయాణాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. 

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గర్భిణులు 
గత ఏడాది రెండో దశ వ్యాప్తిలో వైరస్‌బారిన పడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. సాధారణంగా గర్భం దాల్చాక మహిళలు బరువు పెరుగుతారు. ఇదే సమయంలో గర్భసంచి పైకి పెరగడంవల్ల ఊపిరితిత్తులపై పొట్ట ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతుంటాయి. కరోనా ప్రభావం కూడా ఊపిరితిత్తులపైనే ఎక్కువగా ఉంటుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో గర్భిణులు ఇబ్బందులు పడతారు. దీనికితోడు వైరస్‌ ప్రభావంతో గర్భస్రావం, నెలలు నిండని కాన్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. 

ఇలా చేస్తే సులభంగా బయటపడొచ్చు 
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ సోకినా సులభంగా బయటపడొచ్చని వైద్యులు తొలినుంచీ సూచిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా వైరస్‌ బారినపడి గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న వారికి రోగ నిరోధకత తగ్గుతుంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవి.. 

తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రభుత్వం ప్రికాషన్‌ డోసు వేస్తోంది. రెండో డోసు వేసుకుని 39 వారాలు గడిచిన వారు ప్రికాషన్‌ డోసు వేయించుకోవాలి.  
అనుమానిత లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.  
క్రమం తప్పకుండా మధుమేహం, రక్తపోటు అదుపులో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి.     
తేలికపాటి వ్యాయామాలు చేయాలి.   
తాజా ఆకుకూరలు, పాలు, కాయగూరలు, పండ్లు ఆహారంలో తీసుకోవాలి. మాంసాహారులు చేపలు, కోడిగుడ్లు తీసుకోవచ్చు.  
మధుమేహం వ్యాధిగ్రస్తులు ‘డయాబెటిక్‌ డైట్‌’ను కచ్చితంగా కొనసాగించాలి. 
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ పేషెంట్లు ఇంట్లో, బయట మాస్క్‌ ధరించాలి. బయటికివచ్చినప్పుడు డబుల్‌ మాస్క్, ఫేస్‌షీల్డ్‌ తప్పక ధరించడం మేలు. 

చాలా జాగ్రత్తగా ఉండాలి 
గర్భిణులు, చిన్న పిల్లల తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణుల్లో రక్తం గడ్డకట్టే లక్షణాలుంటాయి. అంతేకాక.. వీరికి వైరస్‌ సోకితే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు. అనుమానిత లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మాస్క్‌ ధరించడం, సమూహాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. వీలుంటే ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలి. అనుమానిత లక్షణాలున్న తల్లులు బిడ్డలకు పాలిచ్చేప్పుడు మాస్క్‌ ధరించడం మేలు. 
– డాక్టర్‌ బి. వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, గైనకాలజీ విభాగాధిపతి గుంటూరు జీజీహెచ్‌ 

మందులు కొనసాగించాలి 
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తాము వాడుతున్న మందులను ఆపకూడదు. జలుబు చేయడం, ముక్కు కారడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చెయ్యొద్దు. వెంటనే వైద్యులను సంప్రదించి, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. 
లక్షణాలు కనిపించిన వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండటం శ్రేయస్కరం. ఇలాచేస్తే కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాప్తి చెందదు.  
– డాక్టర్‌ కె. సుధాకర్, సీనియర్‌ పల్మనాలజిస్ట్, రాష్ట్ర కోవిడ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement