ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు | Prashant Bhushan, Parakala Prabhakar On Central Election Commission | Sakshi
Sakshi News home page

ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు

Apr 1 2026 4:07 AM | Updated on Apr 1 2026 4:07 AM

Prashant Bhushan, Parakala Prabhakar On Central Election Commission

ప్రభుత్వ కీలుబొమ్మగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన

ఈవీఎం సాఫ్ట్‌వేర్, వీవీప్యాట్ల అద్దాల మార్పుతో ఇష్టానుసారం 

ఓట్ల మళ్లింపు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కనపెట్టి ప్రభుత్వ గుప్పిట్లోకి ఈసీ నియామకాలు

ఫామ్‌ 17సీ, ఓటరు జాబితాల గోప్యత వెనుక ఆంతర్యమేంటి? వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టరు?... దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా పోలింగ్‌ సమయం ముగిశాక ఓట్ల శాతంలో గణనీయ పెరుగుదల

ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సాయంత్రం 5 తర్వాత 12.5కు పైగా పెరిగిన ఓట్ల శాతం... అక్రమాల నిరోధాలకు కాపలాదారుగా ఉంటూ కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్‌  

‘భారత్‌ జోడో అభియాన్‌’ సదస్సులో సామాజిక వేత్త ప్రశాంత్‌ భూషణ్‌ 

ఏపీలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్‌పై అనేక అనుమానాలు: సామాజిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యం పాలవుతోందని, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తన స్వతంత్రతను, నిజాయితీని కోల్పోయి అవినీతిమయంగా మారిందని ప్రముఖ సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీఎన్‌ శేషన్‌ లాంటి అధికారుల ఆధ్వర్యంలో అత్యంత నిష్పక్షపాతంగా నడిచిన ఈసీ.. నేడు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మంగళవారం ‘భారత్‌ జోడో అభియాన్‌’ ఆధ్వర్యంలో ‘ఎన్నికల సమగ్రతకు సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. 

ఎన్నికల పారదర్శకతకు అత్యంత కీలకమైన ఫామ్‌ 17సీ విషయంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ డేటాను వెబ్‌సైట్‌లో ఉంచడానికి ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. పైగా, ఈ ఫారం–17సీకి, ఓట్ల లెక్కింపు తర్వాత ఇచ్చే ఫారం–20కి మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయని, ఓటరు జాబితాల సవరణలో ఈసీ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని ఆరోపించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు కేవలం సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సరిపోతుందని, కానీ ఈసీ ఉద్దేశపూర్వకంగా ప్రజలను వేధిస్తోందని ఆయన విమర్శించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ప్రజల్లో 90 శాతం అపనమ్మకం ఉందని సర్వేలు చెబుతున్నాయని ప్రశాంత్‌ భూషణ్‌ గుర్తు చేశారు. 

‘ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్, వీవీప్యాట్లను కంట్రోల్‌ యూనిట్‌తో అనుసంధానం చేసే సాఫ్ట్‌వేర్‌ను ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లోడ్‌ చేస్తారు. ఆ సాఫ్ట్‌వేర్‌లో ఏముందో ఎవరికీ తెలియ దు. అందులో మాలీషియస్‌ (హానికరమైన) కోడ్‌ ఉంటే పరిస్థితి ఏంటి? దీన్ని టైమ్‌ బేస్డ్‌గా కూడా సెట్‌ చేస్తున్నారు. మాక్‌ పోలింగ్‌ సమయంలో, ఉదయం 10 గంటల వరకు యంత్రం  పక్కాగా పని చేస్తుంది. ఆ తర్వాత ఏ బటన్‌ నొక్కినా ఓటు మాత్రం వాళ్లు సెట్‌ చేసిన పార్టీకే వెళ్లేలా మ్యానిప్యులేట్‌ చేస్తున్నారు. వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీ చెబుతున్న సాకులు విడ్డూరంగా ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినా ఇప్పటి వరకు విచారణ జరగకపోవడం శోచనీయం. దేశంలో న్యాయవ్యవస్థ పరిస్థితి కూడా దయనీయంగా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఇంకా పలువురి వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

అంధ్రప్రదేశ్‌ ఫలితాలు అత్యంత సందేహాస్పదం
మే 13న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. దీన్ని బట్టి గంటకు సగటున 6.8 శాతం పోలింగ్‌ జరిగినట్లు అర్థమవుతుంది. పోలింగ్‌ శాతం రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో పోలింగ్‌ శాతం పెరుగుదల కేవలం 0.08 శాతం మాత్రమే. కానీ.. అదే రోజు రాత్రి 11.45 గంటలకు పోలింగ్‌ శాతం 76.50 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకూ పోలింగ్‌ శాతం 8.38 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. 

తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్‌ జరిగినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు. పోలింగ్‌ ముగిసే సమయానికి మొత్తం 80.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే.. మే 13న రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 2.15 గంటల్లో 4.16 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 3.33 కోట్లు. ఇందులో 4.16 శాతం అంటే 17,19,482 ఓట్లు కేవలం 2.15 గంటల వ్యవధిలో పోలైనట్ల స్పష్టమవుతోంది. ఈ ఓట్లు మొత్తం 3,500 పోలింగ్‌ బూత్‌లలో పోలయ్యాయి. ఒక్కో బూత్‌లో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. 2.15 గంటలు అంటే 135 నిముషాల్లో 491 ఓట్లు.. అంటే ఒక నిముషానికి ముగ్గురు ఓటు వేశారు. 

అంటే ఒక వోటరు వోటు వేయడానికి తీసుకున్న సమయం 20 సెకన్లు. శాసనసభ అభ్యర్థికి ఒక కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేశాక వీవీ ప్యాట్‌ స్లిప్‌ రావడానికి 7 సెకన్లు.. లోక్‌సభ అభ్యర్థికి మరో కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేశాక వీవీ ప్యాట్‌ రావడానికి 7 సెకన్లు మొత్తం 14 సెకన్లు సమయం పడుతుంది. అంటే.. మిగతా 6 సెకన్లలో ఓటరు గుర్తింపు కార్డు చూపడం, దాన్ని పోలింగ్‌ అధికారి తనిఖీ చేయడం, ఓటరు జాబితాలో ఆయన పేరు టిక్‌ చేయడం, సంతకం లేదా వేలిముద్ర తీసుకోవడం, ఓటరు చేతి వేలిపై ఇంక్‌ పెట్టడం ఇలా 6 సెకన్లలో రెండు ఓట్లు వేయడం సాధ్యమమ్యే పనేనా? పైగా మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే నమోదైన తుది పోలింగ్‌ శాతం ప్రకటించడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టిడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

మే 13 పోలింగ్‌ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన శాతం నుంచి మే 17న ప్రకటించిన తుది శాతం వరకు మొత్తం 12.62 శాతం పెరుగుదల ప్రకారం చూస్తే అర్థరాత్రి అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయి. ఈ సంఖ్యను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పంచితే, ఒక్కో నియోజకవర్గానికి సగటున 29,618 అదనపు ఓట్లు వస్తాయి. ఈ పెరుగుదల అన్ని చోట్ల సమానంగా ఉండే అవకాశం లేదు. ఈ పెరుగుదల కొన్ని లకి‡్ష్యత నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రమే జరిగి ఉంటే, అది కొంత మంది అభ్యర్థులు లేదా పార్టీలకు భారీ విజయాన్ని ఇవ్వగలదు, మరికొంత మందిని పూర్తిగా ఓడించగలదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల తీర్పు తీవ్ర అనుమానాస్పదంగా మారింది.
– డాక్టర్‌ పరకాల ప్రభాకర్, ప్రముఖ ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్త

ఈవీఎంలపై అనుమానాలు తీర్చాల్సిందే  
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై ప్రజలు, రాజకీయ పార్టీల్లో తలెత్తుతున్న అనుమానాలను ఏమాత్రం తీసిపారేయలేం. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఈసీపై ఉంది. పోలైన వీవీప్యాట్‌ స్లిప్పులను కచ్చితంగా వంద శాతం లెక్కించాలి. దీనిపై ఈసీ చెబుతున్న సాకులు సరికాదు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ (కొలీజియం)లో ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత ఉంటే అది 2ః1 నిష్పత్తిలో అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుంది. అందువల్ల సీజేఐ కచ్చితంగా ఉండి తీరాలి. జమిలి ఎన్నికల విధానం ఆచరణలో ఎండమావి లాంటిదే.
– ఎస్‌.వై ఖురేషీ, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌

ఏపీ తరహాలోనే ఒడిశాలోనూ సందేహాలు
2024లో జరిగిన సాధారణ ఎన్నికల తీరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వలే ఒడిశాలో కూడా పలు అనుమానాలను రేకితిస్తోంది. మొదట ప్రాథమికంగా ప్రకటించిన పోలింగ్‌ శాతానికి తుది పోలింగ్‌ శాతం మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తొలుత 62.02 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని ప్రకటించగా ఆ తర్వాత ఏకంగా 12.48 శాతం పెంచేశారు. అంటే 42 లక్షల అదనపు ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల జాబితా, ఈవీఎం, అర్థరాత్రి ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా సమాధానం చెప్పాలి. 
– సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజేష్‌ మహాపాత్ర

శాశ్వతంగా అధికారంలో ఉండేలా డీలిమిటేషన్‌ 
గతంలో ఎన్నికల సంస్కరణలపై చర్చలు జరిగేవి. ప్రస్తుతం ఎన్నికల అక్రమాలను ఎలా ఆపాలన్న దానిపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుంది. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. అధికార పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ఎన్నికల చర్యలున్నాయి. నియోజకవర్గాల్లో అనుకూలతలను బట్టి ఓట్లను కలపడం (ప్యాకింగ్‌), ఓట్లను విడగొట్టడం (క్రాకింగ్‌), వివిధ ప్రాంతాల్లోని అనుకూల ఓట్లను కట్టగట్టడం (స్టాకింగ్‌) వంటి పనులు చేస్తున్నారు.
– యోగేంద్ర యాదవ్, భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌  

Advertisement
 
Advertisement
Advertisement