భారత అమ్ముల పొదిలో ‘వారుణాస్త్ర’o

Powerful Weapon To Indian Defense Forces - Sakshi

మొదటి సబ్‌మెరైన్‌ విధ్వంసకర ఆయుధం

హెవీ వెయిట్‌ టార్పెడో రాకతో నేవీ మరింత బలోపేతం

నౌకా దళానికి అప్పగించిన బీడీఎల్‌

అభినందనలు తెలిపిన డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌ రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణ దళం అమ్ముల పొదిలోకి శక్తివంతమైన ఆయుధం వచ్చి చేరింది. సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశ సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రని తయారు చేసిన భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) భారత నౌకాదళానికి అప్పగించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కి చెందిన నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌) వారుణాస్త్రని డిజైన్‌ చేయగా, బీడీఎల్‌ దీన్ని తయారు చేసింది. శనివారం విశాఖలోని బీడీఎల్‌ని సందర్శించిన డీఆర్‌డీవో చైర్మన్‌ డా.జి.సతీష్‌రెడ్డి చేతుల మీదుగా వారుణాస్త్రని నేవీకి అప్పగించారు.

ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే బీడీఎల్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌(క్యూర్‌ఎస్‌ఎమ్‌) ప్రయోగం విజయవంతం అవడం దేశానికి గర్వకారణమన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్, బీడీఎల్‌ సంయుక్త సహకారంతో మొదటి వారుణాస్త్రని విజయవంతంగా తయారు చేసినందుకు అభినందనలు తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడో (ఏఎల్‌డబ్ల్యూటీ), ఈహెచ్‌డబ్ల్యూటీ తయారీలో బీడీఎల్‌ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారన్నారు.

వారుణాస్త్ర విశేషాలు: యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్‌ టార్పెడోను సముద్రంలో దాగి ఉన్న శత్రు దేశపు జలాంతర్గావిుపై ప్రయోగించవచ్చు. 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రపంచంలో జీపీఎస్‌ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడోగా వారుణాస్త్ర వినుతికెక్కింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top