చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్‌..

Pots Of Different Designs Are Being Sold In The Market In Summer - Sakshi

చింతూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే వారపు సంతల్లో ఛత్తీస్‌గఢ్‌లో తయారైన చలువ కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ డిజైన్లలో ఎర్రగా కనిపించే ఈ కుండలు మార్కెట్‌లో కనువిందు చేస్తున్నాయి. ప్రత్యేకమైన మట్టితో తయారయ్యే ఈ కుండల్లో పోసిన నీరు ఫ్రిజ్‌లో పెట్టిన మాదిరిగా ఉండడంతో వీటి కొనుగోళ్లుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మందంగా వుండే ఈ కుండలు ఎంతోకాలం మన్నడంతో పాటు నీటికి, వంటకు బాగా ఉపయోగ పడతాయని, అందుకే అధికశాతం వీటినే కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. రూ.50 నుంచి రూ.700 వరకు ధర కలిగిన కుండలతో పాటు వివిధ రకాల బొమ్మలను కూడా సంతల్లో విక్రయిస్తున్నారు.

చదవండి👉: అర్ధ శతాబ్దపు జ్ఞాపకం

ప్రత్యేక మట్టితో తయారీ 
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుకనార్‌లో ప్రత్యేకమైన మట్టితో ఈ కుండలను తయారు చేస్తామని తయారీదారుడు దసురాం తెలిపాడు. భూమి పైభాగంలో కేవలం రెండు అంగుళాల మేర లభించే ప్రత్యేకమైన మట్టిని ఈ కుండల తయారీకి వినియోగిస్తామని అతను తెలిపాడు. ఆ మట్టి జిగటగా ఉండడంతో పాటు గట్టిదనం కలిగి ఉంటుందని దీనివలన కుండలు అందంగా కనబడడంతో పాటు చాలాకాలం మన్నుతాయని తెలిపాడు. మట్టితో కుండలు తయారు చేసిన అనంతరం వాటికి ఎర్రరంగు అద్ది మార్కెట్లో విక్రయిస్తామని తెలిపాడు.  తమ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు కుండలు తయారు చేస్తున్నాయని, వాటిని ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్, సుక్మాతో పాటు ఆంధ్రా సరిహద్దుల్లోని సంతలు, తెలంగాణలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం వంటి పట్టణాల్లో విక్రయిస్తామని అతను తెలిపాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top