
వైద్యశాఖలో ఎన్‌ఎంసీ నిబంధనల పేరిట బ్లాక్ చేసిన పోస్టుల్లో రీపోస్టింగ్‌లు
ఇష్టారాజ్యంగా నిర్వహించిన రీపోస్టింగ్‌లకు సీఎం ప్రత్యేక అనుమతి
రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర వసూల్
సీనియర్లకు అన్యాయం చేసి డబ్బు, పలుకుబడి ఉన్నవారికి నచ్చినచోట పోస్టింగ్
ప్రభుత్వ పెద్దల తీరుపై మండిపడుతున్న వైద్యులు
సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పని చేస్తున్న జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌ను తొలుత గుంటూరు వైద్య కళాశాలకు బదిలీ చేశారు. మళ్లీ రోజుల వ్యవధిలోనే ఆ ప్రొఫెసర్‌కు రాజమండ్రిలో రీపోస్టింగ్ ఇచ్చారు.
గుంటూరు వైద్య కళాశాలలో పనిచేస్తున్న జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌కు తొలుత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పోస్టింగ్ దక్కింది. ఆమెను రీపోస్టింగ్‌లో భాగంగా విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో నియమించారు. ఈమెకు విజయవాడలో రీపోస్టింగ్ కోసం అక్కడ పనిచేస్తున్న వైద్యుడిని గుంటూరుకు పంపారు.
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి వైద్యశాఖలో చేపట్టిన సాధారణ బదిలీల తీరును చూసి వైద్యుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పెద్దలే జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నిబంధనలను సాకుగా చూపి కీలక ప్రాంతాల్లో పోస్టులను బ్లాక్ చేసి రూ.15లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్మేశారని మండిపడుతున్నారు.
ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో ఎన్‌ఎంసీ నిబంధనలను సాకుగా చూపి పాత వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేసి, తమతో డీల్ కుదుర్చుకున్న వారికి ఆ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత నెల 19వ తేదీతో వైద్యశాఖలో బదిలీల ప్రక్రియ ముగిసింది. గడువు ముగిశాక సీఎం ప్రత్యేక అనుమతితో కొందరికి రీపోస్టింగ్‌లు ఇచ్చారు. అంతకుముందు కౌన్సెలింగ్‌లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లిన వైద్యులు... రీపోస్టింగ్ కింద వారు ఇప్పటి వరకు పని చేసిన ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. బదిలీల్లో అక్రమాలపై ఆరోపణలను రీపోస్టింగ్‌లలో చోటుచేసుకున్న చిత్రాలు బలపరుస్తున్నాయి.
‘బ్లాక్’ దందాను బలపరుస్తున్న కొన్ని విచిత్రాలు..
⇒ సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కర్నూల్‌లో పనిచేస్తున్న జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ కింద కాకినాడ లేదా రాజమండ్రిలో పోస్టింగ్ కోరారు. అయితే, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఆ రెండు ప్రాంతాల్లో ఖాళీ లేదని ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. అనంతరం ఇచి్చన రీపోస్టింగ్‌లలో రాజమండ్రిలో పనిచేస్తున్న వైద్యురాలిని కాకినాడకు, గుంటూరులోని వైద్యుడిని రాజమండ్రికి పంపించారు.
⇒ రాజమండ్రిలో పనిచేస్తున్న జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాకినాడకు బదిలీ చేయాలని కోరారు. ఇతని అభ్యర్థనను ఎన్‌ఎంసీ పేరు చెప్పి తిరస్కరించారు. కానీ, కాకినాడలో రెండు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
⇒ నెల్లూరులో పనిచేస్తున్న అనాటమీ ప్రొఫెసర్‌ను తొలుత విశాఖకు బదిలీ చేశారు. అనంతరం సదరు ప్రొఫెసర్‌ను విజయనగరానికి, విజయనగరంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను మ్యూచువల్ కింద విశాఖకు మార్చారు.
⇒ ఆర్థోపెడిక్ విభాగంలోని ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లను గుంటూరు, ఒంగోలుకు మ్యూచువల్ బదిలీలు చేశారు.
⇒ అనంతపురంలో పనిచేస్తున్న పల్మనాలజీ ప్రొఫెసర్‌ను తొలుత విశాఖకు బదిలీ చేశారు. రీపోస్టింగ్‌లో ఆయనను విశాఖ నుంచి ఒంగోలుకు పంపారు. కాకినాడలో పని చేస్తున్న వైద్యురాలిని విశాఖలో నియమించారు. కాకినాడలోనే ఆప్తమాలజీ విభాగంలో పనిచేస్తున్న ఓ డాక్టర్ విశాఖలో ఉన్న రెండు ఖాళీల్లో ఒక దానిలో తనను నియమించాలని అభ్యర్థించినా తిరస్కరించారు.
⇒ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎన్‌ఎంసీ నిబంధనల పేరు చెప్పి కాకినాడ ఆర్థోపెడిక్ విభాగంలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ కింద చూపించలేదు. అయినా విశాఖలో పనిచేస్తున్న వైద్యుడిని కాకినాడ ఆర్థోపెడిక్ విభాగానికి బదిలీ చేశారు. తొలుత ఖాళీ చూపకుండా, ఆ తర్వాత బదిలీల్లో ఆయన్ను ఎలా నియమించారనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో విశాఖలోనే పనిచేస్తున్న ఓ వైద్యుడు తనను కాకినాడకు పంపాలని కోరారు. కానీ, ఖాళీ లేదని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు.
ఒక్కో పోస్టుకు రూ.20 లక్షలు
బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చాక, సీఎం ప్రత్యేక అనుమతులతో ఏకంగా 33 మంది వైద్యులు, ఇతర సిబ్బందికి రీపోస్టింగ్‌లు ఇవ్వడంతోపాటు మ్యూచువల్ బదిలీలు చేశారు. సాధారణ బదిలీల్లో అడ్డగోలుగా తాము అనుకున్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి కుదరదనే ఎన్‌ఎంసీని సాకుగా చూపి పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేశారని వైద్యవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాస్తవానికి సాధారణ బదిలీల మార్గదర్శకాల్లో మ్యూచువల్ బదిలీలకు ఆస్కారం లేదు. బ్లాక్ చేసిన పోస్టుల్లో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర వసూలు చేసి పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి.