రఘురామ పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా 

Postponement of hearing on Raghu Rama Krishna Raju petition till 28th Feb - Sakshi

సీఐడీ విచారణకు ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వండి 

హైకోర్టును కోరిన రఘురామ.. తోసిపుచ్చిన న్యాయమూర్తి 

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌కు నోటీసు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. సీఐడీ విచారణకు ప్రత్యక్షంగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అలాంటి వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదంది. రాఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించాలని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసు జారీచేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు ఇచ్చింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాఘురామకృష్ణరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై సీఐడీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసుకు ఆ సెక్షన్లు వర్తించవని చెప్పారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేసినట్లు కాదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగమే కదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినా అవి ఆరోపణలు, అపవాదులు అవుతాయే తప్ప దేశద్రోహం కిందకు రావని ఆదినారాయణరావు తెలిపారు.

సీఐడీ తరఫున స్పెషల్‌ పీపీ చైతన్య వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు 110 మందికిపైగా సాక్షులను విచారించామని తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దీనిపై రాష్ట్రంలో పలుచోట్ల ధర్నాలు, నిరసనలు కూడా జరిగాయని చెప్పారు. రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో సీఐడీ అదనపు డీజీపై దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని, వాటన్నింటిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌తో సహా మిగిలిన ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ సమయంలో ఆదినారాయణరావు స్పందిస్తూ సీఐడీ విచారణకు ఆన్‌లైన్‌ ద్వారా స్పందించేందుకు వెసులుబాటునివ్వాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top