
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరిన కేతిరెడ్ఢి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా పోలీసులు.. ఆయనతో అనుచితంగా ప్రవర్తించినట్టు సమాచారం.
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. కేతిరెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదు. ఇప్పటి వరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. మరోవైపు.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే.. కచ్చితంగా దాడులు చేస్తామని గతంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.
