
విజయవాడ : కరోనా బాధితుల సహయార్థం విరాళాలు సేకరించడానికి విజయవాడ వెళ్లిన సినీ నటులు షకలక శంకర్‌కు పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో విరాళాలు సేకరించవద్దని తెలిపారు. అనుమతి లేకుండా విరాళాలు సేకరిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా బెంజ్ సర్కిల్ లో విరాళాల సేకరణను అడ్డుకోవడంపై షకలక శంకర్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని, గతంలోనూ కరీంనగర్‌లో విరాళాలు సేకరించి బాధితులకు అందజేశామని పేర్కొన్నారు. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునే ఉద్దేశంతోనే ఈ విరాళాలు సేకరణ అని శంకర్ అన్నారు. విరాళాల కోసం ప్రత్యేకంగా ఒక చోటుని నిర్ణయించుకోలేదని, ఎక్కడ విరాళాలు సేకరణ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్లి పోతానని, అందుకే విజయవాడ వచ్చానని వివరించారు.