దేశవ్యాప్తంగా బెజవాడ ‘ఉగ్ర’ లింకులు | Police identify Bezawada terrorist links as spread across the country | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా బెజవాడ ‘ఉగ్ర’ లింకులు

Mar 26 2026 3:14 AM | Updated on Mar 26 2026 3:14 AM

Police identify Bezawada terrorist links as spread across the country

తీవ్రవాద భావజాలం వ్యాప్తి చేస్తున్న మరో ఇద్దరి అరెస్ట్‌ 

నిందితుల్లో హైదరాబాద్‌ మహిళతో పాటు బీదర్‌ వాసి  

6 రాష్ట్రాల్లో మరో 8 మంది గుర్తింపు 

రంగంలోకి దిగిన 9 పోలీసు బృందాలు

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ)/విజయవాడ లీగల్‌: బెజవాడ ‘ఉగ్ర’ లింకులు దేశవ్యాప్తంగా విస్తరించినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం వేట మొదలుపెట్టారు. పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. 

విజయవాడలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహమ్మద్‌ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్‌ దానిష్, మీర్జా సోహైల్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేస్తున్న కేసులో బుధవారం మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు బీదర్‌కు చెందిన యువకుడు ఉన్నారు. 

ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్‌ చేయగా.. మరో 8 మంది ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు విజయవాడ పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించామని.. 7 రాష్ట్రాల్లో ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్టు చేశామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  

మొత్తంగా 15 మంది గుర్తింపు 
తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న బృందంలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో మొత్తం 15 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. 13 మందిపై విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం విజయవాడకు చెందిన రహంతుల్లా షరీఫ్, మహమ్మద్‌ డానిష్, మీర్జా సోహైల్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసింది. వారినుంచి సీజ్‌ చేసిన సెల్‌ఫోన్ల ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం (సీఐ సెల్‌) గుర్తించింది. 

మరో ఇద్దరిని గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. 7 రాష్ట్రాల్లో ఇటువంటి వారి ఉనికిని ఇప్పటికే గుర్తించి వారిని పట్టుకునే బాధ్యతలను విజయవాడ నగరంలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్ల సీఐలకు అప్పగించారు. మొత్తం 9 బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకుని నిందితుల నివాసం ఉండే స్థానిక పోలీస్‌స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నట్టు సమాచారం. 

ఇందులో భాగంగానే హైదరాబాద్‌ చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన సయిదా బేగం(38)తో పాటు కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్‌ సలాం(38)ని మంగళవారం రాత్రి నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చి బుధవారం చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులిద్దరికీ న్యాయమూర్తి బి.రాధారాణి వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించారు.  

హ్యాండ్లర్లపైనా గురి 
బిహార్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన యువకులు తీవ్రవాద భావాల్ని వ్యాప్తి చేస్తున్న గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నట్టు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించింది. దిల్ఖాష్‌ (బిహార్‌), లక్కీ అహమ్మద్‌ (ఢిల్లీ), అస్మానుల్లా ఖాన్‌ (బిహార్‌), జిషణ్‌ (రాజస్థాన్‌), మీరా ఆసిఫ్‌ అలీ (పశ్చిమ బెంగాల్‌), షారుక్‌ఖాన్‌ (మహారాష్ట్ర), షేక్‌ ఫీజర్‌ రెహమాన్‌ (మహారాష్ట్ర)లను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు విదే శాల్లో ఉండే అల్‌ హకీమ్‌ షుకూర్‌ (హ్యాండ్లర్‌), ఇతర హ్యాండ్లర్ల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రార్థనా మందిరాల్లో జరిగే సమావేశాలకు హాజరయ్యారా అనే దిశగా పోలీసులు విచారణ చేప ట్టారు. నిందితులతో సన్నిహితంగా ఉంటున్న వారి వివరాలను గోప్యంగా సేకరించినట్టు తెలు స్తోంది. స్థానికంగా ఉండే యువకులతో మొ హ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్‌ బేగ్, మొహ్మద్‌ డానిష్‌ మతపరమైన సమావేశాలకు హాజరై అక్కడ యువకులను ఏమైనా ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశారా అనే దిశగా పోలీసులు విచారణ సాగుతోంది.  

తోడు కోసమై ఉగ్రవాద ముఠా వలలో..
సైదా బేగంకు ప్రేమ పేరుతో వల వేసిన ఐసిస్‌ సానుభూతిపరులు 
సోషల్‌ మీడియా ఐడీలు తీసుకుని దుర్వినియోగం 
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్‌): హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన వితంతు మహిళ సయీదా బేగం (38) తోడు కోసం పాకులాడుతూ ఉగ్రవాద సానుభూతిపరుల ఉచ్చులో చిక్కింది. ఈమె సోషల్‌ మీడియా ఐడీలు సంగ్రహించిన ఉత్తరప్రదేశ్, బిహార్‌ వాసులిద్దరు ఐసిస్‌తో పాటు అల్‌ ఖైదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌) భావజాల వ్యాప్తి కోసం వినియోగించారు. ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ అధికారులు మంగళవారం గుట్టురట్టు చేసిన అల్‌ మాలిక్‌ ఇస్లామిక్‌ యూత్‌ కేసులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

చంచల్‌గూడకు చెందిన సయీదా బేగం భర్త ఇమ్రాన్‌ఖాన్‌ నాలుగేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి ఇళ్లల్లో పనిచేస్తూ తన కుమారుడిని (7) పోషించుకుంటోంది. సోషల్‌ మీడి యాలో యాక్టివ్‌గా ఉండే సయీదా బేగం తోడుగా ఉండే వ్యక్తి కోసం సామాజికమాధ్యమాల్లో అన్వేషిస్తోంది. దీనిని ఉగ్రవాద సానుభూతిపరులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈమెతో చాటింగ్స్‌ చేస్తూ, ఆసక్తి ఉన్నట్టు నటిస్తూ తమ లక్ష్యాలను సాధించడానికి యత్నించారు. 

దీనిలోభాగంగా  నిషేధిత ఉగ్రవా ద సంస్థ ఐసిస్‌ సానుభూతిపరుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరీష్ అలీ, బిహార్‌కు చెందిన  షాద్‌మన్‌ దిల్‌ఖుష్‌ సయిదాబేగం ఐడీలతో ఐసిస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. యూపీ ఏటీఎస్‌ అధికారులు ఈనెల 15న హరీష్‌ అలీని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే దిల్‌ఖుష్, సయీదాబేగంను అరెస్టు చేసిన పోలీసులు  తొలుత ఈమెను ఐసిస్‌ సానుభూతిపరురాలిగా అనుమానించారు. అయితే విచారణలో దిల్‌ఖుష్, సయీదా వెల్లడించిన వివరాల ఆధారంగా అభియోగ పత్రాలు దాఖలు సమయంలో కేసు నుంచి సయీదా పేరు తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement