పోలవరం పనులపై ప్రాజెక్ట్‌ అథారిటీ సంతృప్తి

Polavaram: Project‌ Authority Satisfaction On Polavaram Works In AP - Sakshi

దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు 

వేగవంతం చేయాలని సూచన

నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం

సాక్షి, అమరావతి/పోలవరం: గోదావరి నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలోనూ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు నిర్విఘ్నంగా.. శరవేగంగా కొనసాగుతుండటంపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) సంతృప్తి వ్యక్తం చేసింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించింది. నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్, సభ్య కార్యదర్శి ఎంకే శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే, ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డాŠయ్‌మ్‌(ఈసీఆర్‌ఎఫ్‌), విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.

వరద కాలంలోనూ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను వేగంగా చేస్తుండటంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను నెలాఖరులోగా రక్షిత స్థాయికి పూర్తి చేయాలని సూచించింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నీటిని పూర్తిగా తోడివేశాక.. ఈసీఆర్‌ఎఫ్‌ పునాది డయా ఫ్రమ్‌ వాల్‌ పటిష్టతను మరోసారి పరిశీలించాలని సూచించింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ) మార్గదర్శకాల మేరకు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నదీ గర్భంలో ఖాళీ ప్రదేశాన్ని వైబ్రో కాంపక్షన్‌ విధానంలో అభివృద్ధి చేసి.. ఈసీఆర్‌ఎఫ్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించింది. ప్రాజెక్ట్‌ సీఈ ఎం.సుధాకర్‌బాబు పనుల పురోగతిని పీపీఏకు వివరించారు. 

పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌పై జాతీయ కమిటీ సమీక్ష
రేపు ఢిల్లీలో సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాజెక్టులకు సంబంధించి పునరావాసం, పరిహారం (ఆర్‌ అండ్‌ ఆర్‌) అమలుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని భూ వనరుల విభాగానికి చెందిన పునరావాసం, పరిహారంపై జాతీయ పర్యవేక్షణ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పునరావాసం, పరిహారం అమలుపైనా సమీక్షించనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంత నిర్వాసితులకు పునరావాసం, పరిహారం కల్పించకుండా తరలిస్తున్నారంటూ పెంటపాటి పుల్లారావు చేసిన ఆరోపణలనూ చర్చనీయాంశంగా అజెండాలో చేర్చినట్టు  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రథమ కార్యదర్శి జీకే ధకాటే పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top