Corruption Cases: గులాబీ రంగునీళ్లు బాటిలే మెయిన్‌ ఎవిడెన్స్.. దీని వెనుక కథ తెలుసా?

Pink Water Bottles Are The Main Evidence In Corruption Cases - Sakshi

ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): అవినీతి నిరోధక శాఖ(యాంటీ కరప్షన్‌ బ్యూరో) పలు ఆకస్మిక దాడుల్లో లంచావతారాలను పట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా అధికారులు లంచాలు తీసుకునే క్రమంలో ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అయితే ఇలా అవినీతిపరులను పట్టుకున్నప్పుడు కామన్‌గా కనిపించే ఒక ఇమేజ్‌ ఎప్పుడైనా గుర్తించారా.? అదే కరెన్సీ నోట్లపై గులాబీ రంగు నీళ్ల బాటిళ్లు ఉంచే ఫొటో. అయితే దీని వెనుక కథ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయతనించారా?
చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్‌ఎం.. అసలు ఏం జరిగిందంటే? 

నిజానికి ఈ రంగు నీళ్ల బాటిలే ఆ నేరంలో ప్రధాన సాక్షమని మీకు తెలుసా.? అయితే రండి తెలుసుకుందాం. లంచం డిమాండ్‌తో విసుగుపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించినప్పుడు ఆయనకు ఇవ్వబోయే కరెన్సీ నోట్లకు ఏసీబీ అధికారులు ముందుగా కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తారు. ఆ నోట్లపై ఫినాప్తలీన్‌ అనే తెల్లని రసాయన పొడిని ఆ నోట్లపై చల్లి బాధితుడి చేత అవినీతి అధికారికి ఇప్పిస్తారు.

బాధితుడి నుంచి అధికారి ఆ నోట్లు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. లంచగొండి అధికారి తీసుకున్న ఆ నోట్లను గుర్తించి వాటిని తొలుత ఆ అధికారి ఎదుటే చేతులతో తాకుతారు. అనంతరం చేతులను సోడియం కార్బోనేట్‌తో ఓ బౌల్‌లో కడిగినప్పుడు రసాయన చర్య జరిగి నీళ్లు గులాబీ రంగులోకి మారతాయి. దీంతో ఆ అధికారి లంచం తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారించడంతో పాటు ఈ ద్రావణాన్ని బాటిళ్లలో సేకరించి నోట్లపై ప్రదర్శిస్తారు. ఆ అవినీతి ఘటనలో ఆ బాటిళ్లలో ద్రావణాన్ని ప్రధాన సాక్షంగా తీసుకుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top