ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత చికిత్స

అక్కడి భూగర్భ జలాల కారణంగానే ప్రబలిన కిడ్నీ వ్యాధి
గత సర్కారు నిర్లక్ష్యం వల్ల పరిష్కారం కాని సమస్య
వైఎస్ జగన్ సీఎం కాగానే రూ.700 కోట్లతో రక్షిత మంచి నీటి పథకం
హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటి వినియోగం
మెళియాపుట్టి వద్ద నీటి శుద్ధికి ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు
84 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఫిల్టర్ బెడ్‌ల పనులు ప్రారంభం
369 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు మొదలు
పైపులైన్ నిర్మాణానికి సర్వే పూర్తి..
రెండేళ్లలో 7.82 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం
సాక్షి, అమరావతి: ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాల తరబడి వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత చికిత్స ఆరంభించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఈ సమస్యపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతంలో వ్యాధి ప్రబలడానికి అక్కడి భూగర్భ జలాలే కారణమని పలువురు నిపుణులు నిర్ధారించడంతో.. ఆ ప్రాంత ప్రజలు తాగేందుకు ఏడాది పొడవునా సురక్షిత నదీ జలాలను సరఫరా చేసేందుకు భారీ మంచి నీటి పథకం పనులను వేగవంతం చేశారు. ఉద్దానంగా పిలవబడే ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 809 నివాసిత ప్రాంతాలకు హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా నదీ జలాలను తరలించేందుకు రూ.700 కోట్లతో మంచి నీటి పథకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు పనులు ఇలా..
► రోజుకు 84 మిలియన్ లీటర్ల తాగు నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మెళియాపుట్టి ప్రాంతంలో నీటి ఫిల్టర్ బెడ్‌ల నిర్మాణానికి భూమి తవ్వకం పనులు కొనసాగుతున్నాయి.
► ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించగా.. అందులో 369 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి.
► హిరమండలం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా కాకుండానే, 124 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా నీటిని తరలించాల్సి ఉంది. ఈ మేరకు పైపులైన్ నిర్మాణానికి సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. 19 ప్రదేశాల్లో పైపులైన్ ఏర్పాటుకు రైల్వే, అటవీ, ఆర్ అండ్ బీ అధికారుల నుంచి అనుమతి తీసుకునే ప్రక్రియను ఇప్పటికే ఆరంభించారు.
7.82 లక్షల మందికి ప్రయోజనం
ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్య అంటే.. కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 7,82,707 మంది ప్రజల సమస్య. ఇక్కడి ప్రజలందరికీ ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున ఏడాది పొడువునా వచ్చే 30 ఏళ్ల కాలం తాగునీటి సరఫరా చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో 170 నివాసిత ప్రాంతాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా తాగునీరు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు.
బాబు సర్కార్ మాయమాటలతో సరి
► ఉద్దానం ప్రాంతంలో బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవి సమయంలో ఎండిపోతున్నాయి. ఆ సమయంలో ప్రజలు బోరు నీటిని తాగక తప్పడం లేదు. దీంతో వారు వ్యాధి బారిన పడుతున్నారు.
► ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా, గత టీడీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పిందే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 సెప్టెంబర్ 6వ తేదీన శాశ్వత రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు.
► హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ప్రాంత ప్రజల కోసం కేటాయిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు.