
చంద్రబాబు అరాచకాలపై మండిపడుతున్న పులివెందుల ప్రజానీకం
గ్రామాలకు గ్రామాలే ఓటింగ్‌కు దూరం.. ఒక్కరినీ ఓటేయనివ్వలేదు
అలాంటప్పుడు టీడీపీ గెలుపు ఎలా సాధ్యం?
పోలీసులే టీడీపీ గూండాలకు అండగా నిలిచారు.. అంతా ఏకపక్షం
ఓటర్లను రానివ్వకుండా.. ఏజెంట్లను బూత్‌ల నుంచి వెళ్లగొట్టి దౌర్జన్యాలు
బయట ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తరలించి రిగ్గింగ్..
ఇంత అరాచకమా? మా ఓట్లెక్కడ? ప్రజాస్వామ్యం ఎక్కడుంది?
ఏడు పల్లెల్లో వైఎస్ జగన్‌ను కాదని ఇతరులకు ఓటేసే చాన్సే లేదు
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఈ ప్రభుత్వ పాలన నిజంగానే బాగుంటే మాతో ఓట్లు ఎందుకు వేయనివ్వలేదు చంద్రబాబూ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? బీటెక్ రవికి మా ప్రాంతంలో ఓటు హక్కే లేదు. అసలు బయటి వారికి మా గ్రామాల్లో ఏం పని?..’’ అంటూ పులివెందుల మండలానికి చెందిన గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారు. బందిపోటు ముఠాలు, పిండారీలు, దోపిడీ దొంగలు ఊర్లపై పడి మొత్తం దోచుకున్నట్లుగా తమ ఓట్లు కూడా దోచేశారని మండిపడుతున్నారు.
గ్రామాలకు గ్రామాలే ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయని.. అసలు తాము ఓట్లే వేయనప్పుడు టీడీపీ ఎలా గెలుస్తుందని, విజయం సాధించిందని ఎలా ప్రకటిస్తారని విస్తుపోతున్నారు. తామంతా ఇంకా బతికేఉన్నా దొంగ ఓట్లు వేసుకుని తమను చంపేశారని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలని, తమ ఓటు హక్కు తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకోవడం.. బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లే లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించుకోవడం.. పోలీసు యంత్రాంగం మొత్తం వారికి కొమ్ముకాయడం లాంటి అరాచకాలు జరుగుతుంటే కొరడా ఝళిపించాల్సిన ఎన్నికల కమిషన్ ఏమీ పట్టనట్లు నిస్తేజంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కాదా? విచ్చలవిడిగా రిగ్గింగ్ జరుగుతుంటే కళ్లు మూసుకుని కూర్చోవడం ఏమిటి? అని ఆయా గామాలకు చెందిన ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు.
నా భర్త ఏజెంట్ ఫారాలు తీసుకెళ్తుంటే లాక్కొని వెళ్లగొట్టారు
నా కుమారుడు, భర్త ఏజెంట్ ఫారాలు తీసుకెళుతుంటే అడ్డుకుని చింపి గ్రామం నుంచి వెళ్లగొట్టారు. జమ్మలమడుగు, కమలాపురం, అనంతపురం నుంచి సుమారు 300 మంది బయట ప్రాంతాల వారు వచ్చారు. ఓటు వేసేందుకు వెళ్లిన వారిని బెదిరించి వెనక్కి పంపించారు. మా ఓట్లన్నీ దౌర్జన్యంగా వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? – అప్సరీ మస్తానమ్మ, చంద్రగిరి
స్లిప్పులు లాక్కుని బెదిరించారు
1978లో మొదటిసారి ఓటు వేసినప్పటి నుంచి ఇలాంటి దౌర్జన్యాలు, అరాచకం ఎన్నడూ చూడలేదు. ఇప్పటివరకు ఎన్నికల్లో ఇష్టమున్న వారికి ఓట్లు వేశాం. ఈసారి బూత్ వద్దకు వెళ్లగానే స్లిప్పులు లాక్కుని తామే ఓట్లు వేస్తామని, వెళ్లిపోవాలని బెదిరించారు. ఇంత చేసి ప్రజాస్వామ్యయుతంగా గెలిచామంటున్నారు! ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? పూర్వం ఊర్లకు ఊర్లు దోచుకెళ్లేవారు. ఇది కూడా అలాగే ఉంది. –భాస్కరరెడ్డి, కొత్తపల్లె
ఇంత దరిద్రమైన పనులా..?
రాజకీయ నాయకుడు నీతి, నిజాయితీగా ఉంటేనే ఏ పార్టీ అయినా ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తే ఏ నాయకుడూ నిలబడడు. ఇంత దరిద్రమైన పనుల కన్నా రాజకీయాలు వదులుకునేది మేలు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. మేం ఓటు వేయలేదు. – భూమిరెడ్డి మోహన్‌రెడ్డి, కొత్తపల్లె
రీ పోలింగ్ రోజూ వెళ్లలేదు..
ఎన్నికల సమయంలో మేం ఎవరికి ఓటు వేసినా తర్వాత అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పుడు బయటి నుంచి జనాలను తీసుకొచ్చారు. వారు ఎవరో కూడా మాకు తెలియదు. అసలు ఏజెంట్లే లేకుండా చేశారు. ఓటర్లు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లలేని పరిస్థితి కల్పించారు. రీ పోలింగ్ రోజు కూడా భయపడి మేం బూత్‌ల వద్దకు వెళ్లలేదు. – బాలగంగిరెడ్డి, చంద్రగిరి
ఫ్యాన్‌కు ఓటు వేస్తానని చెప్పా.. !
నేను 1942లో పుట్టా. ఇంత దౌర్జన్యం, అన్యాయం ఏనాడూ చూడలేదు. అధికారంలో ఉన్నంత మాత్రాన ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటి? మేం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తానని చెప్పడంతో స్లిప్పు లాక్కుని అక్కడికక్కడే చింపేశారు. – వెంకటమ్మ, యర్రబల్లి
ఎవరికి ఓటేస్తున్నారని ప్రశ్నించారు..
ఓటు వేసేందుకు ఉదయం రెండు సార్లు వెళ్లినా రానివ్వలేదు. 12.00 గంటలకు రమ్మన్నారు. ఓటరు స్లిప్పు లాక్కునేందుకు ప్రయత్నిస్తే నేను ఇవ్వలేదు. చివరికి నాకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వకుండా తామే వేసుకుంటామని చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చిన వారందరినీ ఎవరికి ఓటేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. – పుల్లమ్మ, దళితవాడ
ఏజెంట్‌గా వెళ్తే వెళ్లగొట్టారు
పోలింగ్ ఏజెంట్‌గా బూత్‌లో కూర్చొనేందుకు వెళితే ఎందుకొచ్చావంటూ బెదిరించి వెళ్లగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారి స్లిప్పులు లాక్కుని పంపేశారు. ఈమాత్రం దానికి ప్రచారంలో ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయమని ఎందుకు అడిగారు? అసలు పోలింగ్ ఎందుకు పెట్టారో చెప్పాలి! – రమాదేవి, దళితవాడ
ఏడు పల్లెల్లో జగన్‌ను కాదని ఓట్లు వేయరు..
మేమంతా జగన్ కావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటాం. ఇక్కడ ఈ ఏడు పల్లెల్లో వైఎస్ జగన్‌ను కాదని ఇతరులకు ఓటు వేయరు. మా ఓటు మమ్మల్ని వేయనివ్వకుండా అడ్డుకున్నారు. జగన్‌పై గెలవలేక బయటి ప్రాంతాల వారిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారు. – రామసుబ్బారెడ్డి, కొత్తపల్లె
ఇప్పటికీ ఓటర్ స్లిప్ నా వద్దే
నాకు 75 ఏళ్లు. ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్ మొహం చూడలేదు. ఇప్పటికి ఓటరు స్లిప్పు నావద్దే ఉంది. టీడీపీ వారు గెలిచామని అంటున్నారు. అసలు ఓట్లు ఎవరు వేశారో చెప్పాలి. పోలీసుల వద్దకు వెళ్లి అడిగితే నవ్వి ఊరుకున్నారు. ఎర్రబల్లిలో ఎవరు ఓటు వేయలేదు. ఈ ఏడు పల్లెల్లో ఓట్లు వేయలేదు. ఇది వాస్తవం. – చక్రానాయక్ కృష్ణమూర్తి, కొత్తపల్లె
బయటోళ్లు ఓట్లన్నీ వేసుకున్నారు..
టీడీపీ వాళ్లు బయటి ప్రాంతాల వారిని తీసుకొచ్చి మమ్మల్ని ఓట్లు వేయనివ్వలేదు. క్యూ లైన్‌లోకి వారి మనుషులను పిలిపించుకుని ఓట్లు వేయించుకున్నారు. మా ఓట్లను ఇతర ప్రాంతాల వారు వేసుకునే హక్కు ఎవరిచ్చారు? మా ఊరికి చెందిన ఇద్దరిని కొట్టడంతో భయపడి ఎవరూ పోలింగ్‌బూత్ వద్దకు వెళ్లలేదు.– ముత్యాలమ్మ, కనంపల్లె
కాళ్లు పట్టుకున్నా కనికరం లేదు
ఓటు వేసేందుకు వెళితే రౌడీల్లాగా పోలింగ్ కేంద్రాల వద్ద కాపలా ఉన్నారు. కొట్టాలు, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన వారు మా గ్రామానికి వచ్చారు. బూత్ వద్దకు వెళితే పోలీసులు అడ్డుపడ్డారు. నా కుమారుడు పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు. మా ఊరిలో ఒక్కరూ ఓటు వేసిన పాపాన పోలేదు. – తులశమ్మ, కనంపల్లె
ఈసీ.. మా ఓటు ఎక్కడ?
ఓట్లకు పోనీయకుండా పోలీసులే దగ్గరుండి దౌర్జన్యం చేశారు. అవమానకరంగా మాట్లాడారు. ఒక్కో చోట 50 నుంచి 60 మంది పోలీసులను పెట్టారు. మా గ్రామస్తులను ఓటు వేయనివ్వలేదు. ఓటు వేసేందుకు వెళితే తరిమేశారు. మేం ఇంకా బతికే ఉన్నాం.. మా ఓటు మేమే వేయాలి. మాకు ఓటు హక్కు కావాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. – బుక్కే సాలమ్మ
ఊరంతా ఓటేయలేదు..
కనంపల్లెలో ఊరు ఊరంతా ఒక్క ఓటు కూడా వేయలేదు. దొంగ ఓట్లు గుద్దుకున్నారు. మేమంతా చనిపోయినట్లే భావిస్తున్నాం. ఈ ఎన్నికలను తలుచుకుంటే బాధేస్తోంది. మా ఓట్లు మాకు కావాలి. – నాగలా నాయక్, కనంపల్లె
హీనమైన పని బాబూ..!
50 ఏళ్లుగా రాజకీయాలను చూస్తున్నా. ఇలాంటి ఎన్నిక ఎన్నడూ జరగలేదు. పోలీసులతో బందోబస్తు పెట్టుకొని మేం పోలింగ్ కేంద్రాల వద్దకు పోకుండా నిర్బంధించి ఓట్లు వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా హీనమైన పని చేశాడు. – కమాల్, చంద్రగిరి
పాలన బాగుంటే ఓట్లు ఎందుకు వేయనివ్వలేదు?
ఈ ప్రభుత్వ పాలన సక్రమంగానే ఉంటే మమ్మల్ని ఓటు ఎందుకు వేయనివ్వలేదు? టీడీపీ మూకలు చొరబడి మా ఊరిని సర్వనాశనం చేశాయి. బయటి వారికి మా ఊరిలో ఏం పని? అసలు బీటెక్ రవికి మా ప్రాంతంలో ఓటు హక్కు లేదు. ఆయన సింహాద్రిపురం మండలానికి చెందిన వ్యక్తి. మా గ్రామంలోని 605 మంది ఓటర్లలో ఒక్కరూ ఓటు వేసిన పాపాన పోలేదు. పోలీసుల కాళ్లు పట్టుకున్నా ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వలేదంటే ఇది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా? - చక్రానాయక్, కనంపల్లె