
గిద్దలూరులోని అటవీశాఖ కార్యాలయం ఎదుట వేచి ఉన్న రంగలక్ష్మమ్మ
గిద్దలూరు అటవీశాఖ అధికారుల ఆటవిక చర్య
ఈ దుర్మార్గం వెలుగులోకి రావడంతో రెండో రోజు రాత్రి విడుదల
గిద్దలూరు రూరల్: గిద్దలూరు అటవీశాఖ అధికారులు ఆటవికంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి తమకు కనిపించకుండా పారిపోయాడని అతని కుమారుడైన 13 ఏళ్ల బాలుడిని రెండు రోజులు నిర్బంధించారు. ‘నీ భర్తను తీసుకువచ్చి మాకు అప్పగించి నీ కొడుకును తీసుకుపో...’ అని బాధిత బాలుడి తల్లికి హుకుం జారీ చేశారు. ఈ దుర్మార్గం స్థానికంగా మీడియా వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శనివారం రాత్రి ఆ బాలుడిని వదిలేశారు. బాలుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కోనంగి పోలయ్య గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు.
ఈ నెల 24న ఆయన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతరపల్లెకు వెళుతుండగా మార్గం మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు కలిసి అడవి జంతువు మాంసం ఉందని చెప్పి అతనికి విక్రయించారు. పోలయ్య ఆ మాంసం తీసుకుని వెళుతుండగా బేస్తవారిపేట అటవీశాఖ రేంజ్ అధికారులు అడ్డుకుని మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడవి జంతువు మాంసం కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని బెదిరించి అతని వద్ద నుంచి రూ.35 వేలు వసూలు చేశారు.
ఈ విషయం గిద్దలూరు అటవీశాఖ రేంజ్ అధికారులకు తెలిసి పోలయ్య కోసం అతని ఇంటికి వెళ్లారు. దీంతో పోలయ్య భయంతో పారిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఉన్న పోలయ్య కుమారుడు(13)ని అటవీశాఖ సిబ్బంది గిద్దలూరు తీసుకొచ్చి తమ కార్యాలయంలో నిర్బంధించారు.
నీ భర్తను తీసుకురా... అంటూ హుకుం
పోలయ్య భార్య రంగలక్ష్మమ్మ శనివారం ఉదయం గిద్దలూరు అటవీశాఖ రేంజ్ కార్యాలయం వద్దకు వచ్చి తన కుమారుడిని విడిచిపెట్టాలని అధికారులను వేడుకున్నారు. దీంతో ‘మీ భర్తను తీసుకురా.. మీ బిడ్డను తీసుకుపో..’ అంటూ అధికారులు హుకుం జారీ చేశారు. ‘నా భర్త తప్పు చేశాడని డబ్బులు కట్టించుకున్నారు. మళ్లీ ఈ విధంగా నా బిడ్డను నిర్బంధించడం ఏమి న్యాయం..’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయం స్థానిక మీడియా వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు ఆందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి 9గంటల సమయంలో రంగలక్ష్మమ్మ, ఆమె తరఫున వచ్చిన పెద్ద మనుషులతో సంతకాలు చేయించుకుని బాలుడిని వదిలిపెట్టారు. ఈ విషయంపై అటవీశాఖ గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.