
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటు వేసేందుకు లైనులో నిల్చున్న టీడీపీ నేత జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లి పొన్నతోట
పులివెందులలో గెలుపు కోసం బాబు సర్కారు అడ్డదారులు
దేశమంతా నిర్ఘాంతపోయేలా ప్రజాస్వామ్యం ఖూనీ.. పోలింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లతో అక్రమాలు
జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి దొంగ ఓటర్ల దిగుమతి
ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రోద్బలంతో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ
15 కేంద్రాల్లోనూ దొంగ ఓట్ల దందా.. బూత్ క్యాప్చరింగ్‌లు.. రిగ్గింగ్‌లు
పోలింగ్ కేంద్రాల బయటే తిష్టవేసిన టీడీపీ గూండాలు
ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి స్లిప్పులు లాక్కుని బెదిరింపులు
పేరు: మల్లిఖార్జున్
హోదా: టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ (జమ్మలమడుగు)
నివాసం: పొన్నతోట గ్రామం, జమ్మలమడుగు నియోజకవర్గం
ఓటు వేసింది: పులివెందుల మండలం ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..
పేరు: పుల్లారెడ్డి
హోదా: టీడీపీ సర్పంచ్
నివాసం: కర్మలవారిపల్లె, జమ్మలమడుగు నియోజకవర్గం
ఓటు వేసింది: పులివెందుల మండలం ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..
పేరు: వీరభద్ర
హోదా: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రధాన అనుచరుడు
నివాసం: వేంపల్లి గ్రామం/మండలం
ఓటు వేసింది: పులివెందుల మండలంలోని ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..
పేరు: సుధాకర్ (మాజీ సర్పంచ్), మహమ్మద్ రఫీ, అనకాల రమేష్
నివాసం: పెద్ద చెప్పలి గ్రామం, కమలాపురం నియోజకవర్గం
ఓటు వేసింది: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో..

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: స్వతంత్ర భారత దేశ చరిత్ర నిర్ఘాంతపోయేలా టీడీపీ కూటమి సర్కారు ప్రజాస్వామ్యాన్ని అత్యంత కిరాతకంగా ఖూనీ చేసింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామిక విలువలను మంటగలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అధికార దుర్వినియోగానికి అడ్డాగా మార్చేసింది. పోలీసు బలగాలు, పచ్చమూకలను అడ్డుపెట్టుకుని భీతావహ వాతావరణాన్ని సృష్టించింది.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న దుర్భుద్ధితో అధికార పార్టీ బరితెగించింది. ఆటవిక రాజ్యాన్ని, తాలిబన్లను మరిపిస్తూ దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్‌లు, రిగ్గింగ్‌లతో విశృంఖలంగా వ్యవహరించింది. పులివెందుల ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా పోలీసు బలగాలు, టీడీపీ రౌడీలతో అడ్డుకుంది. పొరుగు నియోజకవర్గాలైన జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా టీడీపీ గూండాలను తరలించి పోలింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుని అరాచకం సృష్టించింది.
యథేచ్ఛగా దొంగ ఓటర్లను తరలించి..
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న 15 పోలింగ్ కేంద్రాల్లోనూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రోద్బలంతో వేలాది మంది టీడీపీ రౌడీలు, అనుచరులు దొంగ ఓటర్లుగా ప్రత్యక్షమయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నవాబుపేట, భీమగుండం, కంబళదిన్నె, కలవటల, చిన్న దండ్లూరు, గూడెం చెరువు, కర్మలవారిపల్లె, పొన్నతోట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి దొంగ ఓట్లు వేశారు.
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి కనుసన్నల్లో దొంగ ఓటర్లను తరలించారు. పులివెందులకు పొరుగు ప్రాంతాలైన.. అసలు పులివెందుల మండలంలో ఓటర్లు కాదు కదా.. కనీసం స్థానికులతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి దర్జాగా దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఒక్క నల్లపురెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ నుంచి పదవులు అనుభవిస్తున్న వందలాది మంది వ్యక్తులు.. సర్పంచ్‌లు, మార్కెట్ యార్డు సభ్యులు, ఆ పార్టీ నాయకుల ప్రధాన అనుచరులు నిస్సిగ్గుగా దొంగ ఓట్లు వేస్తుంటే ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ముఠా పనులకు కూలీలను తీసుకెళ్లినట్లుగా.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం చంద్రబాబు సర్కారు దొంగ ఓటర్లను దిగుమతి చేసి ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది.
స్లిప్పులు లాక్కుని.. దొంగ ఓటర్లకు పంచి..
పులివెందుల మండలంలోని గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఛాయలకు కూడా రాకుండా చంద్రబాబు సర్కారు పోలీసు బలగాలతో బెదిరింపులకు దిగింది. ఎన్నికల వేళ ఓటర్లకు రక్షణగా నిలిచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా అండగా నిలవాల్సిన పోలీసులే అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారు. గ్రామాల్లో పికెటింగ్ పెట్టి బ్యారికేడ్లతో పోలింగ్ కేంద్రానికి కిలోమీటరు దూరంలోనే ఓటర్లను అడ్డుకున్న దౌర్భాగ్య పరిస్థితి కనిపించింది.

వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి దౌర్జన్యంగా బయటకు గెంటేయడం ద్వారా టీడీపీ పథకం ప్రకారం యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకోవడంతో పాటు కనీవినీ ఎరుగని రీతిలో రిగ్గింగ్‌కు పాల్పడింది. పోలింగ్ కేంద్రాల దగ్గరే తిష్టవేసిన టీడీపీ మూకలు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ల నుంచి బలవంతంగా స్లిప్పులను లాక్కుని.. వాటిని దొంగ ఓటర్లకు పంచుతూ అక్రమాలకు పాల్పడ్డాయి.
‘హెల్ప్’లెస్ డెస్క్‌లు..!
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సహాయార్థం ఏర్పాటు చేసే ‘హెల్ప్‌డెస్క్’లను సైతం ఎన్నికల కమిషన్ నిర్వహించలేని నిస్సహాయ పరిస్థితుల నడుమ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది. టీడీపీ గూండాలతో పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. పోలీసులే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా అడ్డుకుని అరాచక శక్తులకు దండుగా నిలిచారు. ఫలితంగా హెల్ప్‌డెస్క్‌లో ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులను కూర్చోనివ్వకుండా తరిమేశారు.
చివరికి పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఉత్సవ విగ్రహాలు మాదిరిగా మిగిలిపోయారు. కణంపల్లెలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఓట్లు వేయకుండా తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో అక్కడ ఓటర్లు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా ఓట్లు వేసిన జమ్మలమడుగుకు చెందిన కొందరు వ్యక్తుల వివరాలు..
» పాతకుంట శివారెడ్డి, గూడెంచెరువు
» రామచంద్రయ్య, చిన్న దండ్లూరు
» రాజన్న, కలవటల, n కుళాయి, కంబళదిన్నె
» రాజగోపాల్, భీమగుండం
» మర్రి ప్రకాశం, నవాబుపేట
» ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, నవాబుపేట
పచ్చ గూండాల చేతుల్లో పోలింగ్ కేంద్రాలు..!
పులివెందుల మండలం ఎర్రిపల్లి గ్రామంలో టీడీపీ మూకలు పోలింగ్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ గూండాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తూ వికృత చేష్టలతో మహిళలపై దౌర్జన్యానికి దిగి భయబ్రాంతులకు గురి చేశారు. గ్రామంలో ఎవరినీ ఓటు వేయనివ్వకుండా భీతావహ వాతావరణాన్ని సృష్టించారు.