ప్రతి మొక్క బతకాలి.. పచ్చదనం విలసిల్లాలి: పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy Says Jagananna Pacha Thoranam Tree Saplings Planted In This Year - Sakshi

రోడ్ల పక్కన నాటే మొక్కల్లో 90 శాతానికి పైగా బతికించాలన్నది సీఎం జగన్‌ లక్ష్యం

గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వెంబడి 17 వేల కిలోమీటర్ల పొడవున ఈ ఏడాది కోటి మొక్కల్ని నాటేందుకు  ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా.. రాష్ట్రంలో పచ్చదనం విలసిల్లేలా అధికారులు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. పచ్చతోరణం కార్యక్రమం నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ 13 జిల్లాల అధికారులకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం వర్క్‌షాప్‌ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ..  పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రాన్ని ఆకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని, నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా బతికించాలన్నది ఆయన లక్ష్యమని చెప్పారు.

గతంలో మాదిరిగా మొక్క నాటడంతో సరిపెట్టడం లేదని, ప్రతి మొక్క సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసే వీలు కల్పించామని చెప్పారు. మొక్కలకు నీటి తడులు అందించేందుకు ప్రతినెలా డబ్బులు కూడా కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీలో నాటిన మొక్కల్లో కనీసం 83 శాతం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను ఆ గ్రామ సర్పంచ్‌పై పెడుతున్నట్టు చెప్పారు. లేనిపక్షంలో వారు పదవికి అనర్హులుగా ప్రకటించేలా నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

మొక్కల సంరక్షణతో నిరుద్యోగులకు ఉపాధి
మొక్కల సంరక్షణ బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి మొక్కకు నెలకు నాలుగు తడుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి తడికి రూ.5 చొప్పున కిలోమీటర్‌ పరిధిలో కనీసం 400 మొక్కల్ని సంరక్షిస్తే నెలకు రూ.8 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 10 కిలోమీటర్ల పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకొనే వారు ట్రాక్టరు కొనుక్కుంటే రెండేళ్లు తిరిగే సరికి అతనికి కొనుగోలు ఖర్చు లభించి ట్రాక్టరు మిగిలే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ ఏడాది మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధించిన తొలి మూడు జిల్లాల అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సన్మానిస్తామని, అదే సమయంలో చివరి మూడు స్థానాల్లో నిలిచే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది 44 వేల మంది రైతులకు చెందిన 70 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి (సోషల్‌ ఫారెస్ట్‌) చిరంజీవి చౌదరి, ఉద్యావ శాఖ కమిషనర్‌ శ్రీధర్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌ కమిషనర్‌ నవీన్‌కుమార్, సెర్ప్‌ సీఈవో రాజాబాబు, డైరెక్టర్‌ చినతాతయ్య, పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top