
రేషన్ దుకాణాల్లో బియ్యం అయిపోయాయ్
చౌక దుకాణాలకు వెళ్లిన లబ్ధిదారులకు చుక్కెదురు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీడీఎస్‌కు పాతర
దుకాణం పరిధిలోని కార్డులకే బియ్యం పంపిణీ
పోర్టబులిటీ కార్డుదారులకు బియ్యం ఇస్తే.. అసలు కార్డుదారులకు నిల్
అదనంగా 10 శాతం సరఫరా చేయాలన్న నిబంధనలను పట్టించుకోని సర్కారు
సబ్సిడీపై ఇచ్చే గోధుమ పిండి, కందిపప్పుకూ మంగళం
‘‘విజయవాడ నగరంలో ఓ రేషన్ దుకాణంలో 600 కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా అధికారులు ఆ కార్డులకు సరిపడా బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు పోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న అసలు కార్డుదారులకు బియ్యం సరిపోవడం లేదు. వాస్తవానికి ప్రతి దుకాణానికి 10 శాతం కోటా అదనంగా ఇవ్వాలి. కానీ, కూటమి సర్కారు వచ్చాక ఇండెంట్ పెట్టినా పంపని దుస్థితి. ’’.
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నోటిదగ్గర కూడు లాగేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆహార భద్రత చట్టం లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. ఫలితంగా చౌక దుకాణాల్లో నిత్యావసరాలు దొరక్క.. పేదలు అవస్థలు పడుతున్నారు. చౌకదుకాణాల్లో ఏడాదిగా సబ్సిడీ కందిపప్పు, ఫోరి్టఫైడ్ గోధుమపిండి పంపిణీ ఆగిపోయింది.
చిరుధాన్యాలు, పంచదార సరఫరా నామ మాత్రమే. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్నే కూటమి ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేస్తోంది. ఎన్నికల ముందు చౌక దుకాణాల ద్వారా 18 రకాల సరుకులు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన సరుకుల పంపిణీకి కూడా మంగళం పాడడంతో పేదల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అదనంగా బియ్యం ఇవ్వం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ వాహనాలు)పై కక్షగట్టి రద్దు చేసింది. ఈ క్రమంలో ఆర్భాటంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా ప్రారంభించింది. ఒకటో తేదీ వచ్చిందంటే పేదలు రేషన్ కోసం క్యూలైన్లలో కుస్తీలు పట్టాల్సిన దుస్థితి దాపురించింది. చాలా మంది కూటమి నాయకుల సిఫారసులతో డీలర్‌షిప్ దక్కించుకున్న డీలర్లు పంపిణీలో అక్రమాలకు పాల్పడడంతో పీడీఎస్ వ్యవస్థ గాడి తప్పుతోంది.
దుకాణాలు సరిగా తెరవడం లేదు. రోజుల తరబడి షాపుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. చాలా మంది దుకాణాల చుట్టూ తిరిగి విసిగివేసారి సరుకులు తీసుకోకుండా ఉండిపోతున్నారు. దీంతో డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంత నిల్వలను సరఫరా చేయనట్టు చూపిస్తున్నారు. దీనిని సాకుగా చూపి ప్రభుత్వం అదనంగా సరఫరా చేయాల్సిన పదిశాతం బియ్యం ఇవ్వబోమని చెబుతోంది.
కందిపప్పు ఎగ్గొట్టి..
కందిపప్పు సరఫరాకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. వాస్తవానికి చౌక దుకాణాల్లో సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కు ఇవ్వాల్సి ఉంది. కానీ మార్కెట్‌లో ధరలు తగ్గిపోయాయని, రేట్లు పెరిగినప్పుడు మాత్రమే సబ్సిడీపై కందిపప్పు ఇస్తామని చెబుతోంది. వాస్తవానికి ఇప్పుడు మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతోంది.
దీనిని సబ్సిడీపై చౌకదుకాణాల్లో ఇస్తే లబ్దిదారులపై సగానికి సగం ఆర్థికభారం తగ్గుతోంది. ఈ దిశగా సర్కారు ఆలోచించడం లేదు. మొత్తం కార్డుదారులందరికీ కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, ఏడాదిగా అడపాదడపా కేవలం 38వేల టన్నుల కందిపప్పు మాత్రమే కూటమి సర్కారు సరఫరా చేసింది.
బేరం కుదర్లేదని టాక్..
సుమారు రూ.500 కోట్ల బకాయిలు సర్కారు చెల్లించకపోవడంతో కందిపప్పు పంపిణీదారులు చౌకదుకాణాలకు సరుకు సరఫరాకు ముందుకు రావడం లేదు. వచ్చినవాళ్లు కాస్త బహిరంగ మార్కెట్‌లో హోల్‌సేల్ ధర కంటే ఎక్కువకు కోట్ చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ కచ్చితంగా అమాత్యులకు కప్పం కట్టాలనే నిబంధన పెట్టడంతోనే పంపిణీదారులు అధిక ధర కోట్ చేస్తున్నట్టు సమాచారం.
దీనికి విరుగుడుగా అమాత్యులే కొంత మంది వ్యాపారులను ప్రోత్సహించి టెండర్లు వేయించినట్టు సమాచారం. అయితే ఈసారి కప్పం రెట్టింపు ఇవ్వాలని తెగేసిచెప్పడంతో ఖంగుతిన్న సదరు కాంట్రాక్టర్లు మాకెందుకులే ఈ బాధ అని వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఫలితంగా పౌరసరఫరాల సంస్థలో కందిపప్పు కొనుగోళ్లు కేవలం మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్‌లకే పరిమితమైందని సమాచారం.
ఎమ్మెల్యేను దుమ్ముదులిపిన మహిళ
‘‘రేషన్ చూస్తే బియ్యం సరిగారావు. డీలరు బియ్యం లేవు.. కోటా లేదు..అయిపోయిందంటాడు. కందిపప్పు ఇయ్యడు. ఇంకెట్లా సార్..? మాకు బతుకు దెరువు ఎలా..? మాకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుంటే మేము ఎట్టా బతికేది? నేను రోజంతా కూలి చేస్తే రూ.200 ఇస్తారు. కందిపప్పే కిలో రూ.150 పలుకుతోంది. ఇదేంది సారూ!! జవాబియ్యండి’’ అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని గోవిందమ్మ అనే మహిళా కూలి దుమ్ముదులిపేసింది. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యే ఎదుట ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.