ప్రజల్ని దగ్గరకు రానివ్వకుండా బారికేడ్లు
ఐఎస్ జగన్నాథపురంలో పర్యటనపై సర్వత్రా విమర్శలు
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్
ద్వారకాతిరుమల: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో సోమవారం పరదాల మాటున పర్యటించడం చర్చనీయాంశమైంది. ప్రజలను ఆయన దగ్గరకు రానివ్వకుండా బారికేడ్లు అడ్డుపెట్టడం విమర్శలకు దారితీసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పరదాల సీఎం.. కంచెలు వేస్తున్న సీఎం అని గతంలో విమర్శించిన పవన్‌కళ్యాణ్ తాజాగా పరదాల మాటున పర్యటించడం, బారికేడ్లు అడ్డుపెట్టి ప్రజల్ని అడ్డుకోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించిన పవన్‌కళ్యాణ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయినేజీని పరిశీలించిన తరువాత సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయన పర్యటన ఆద్యంతం పరదాల మాటున, బారికేడ్ల మధ్య సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలు తమ సమస్యలను, గోడును చెప్పుకొనేందుకు ఎంతో ఆశగా వస్తే.. కనీసం పవన్‌ను కలవనివ్వలేదని, అడుగడుగునా పోలీసులు అడ్డుపడ్డారని పలువురు వాపోయారు. ఎన్నికల ముందు ప్రశ్నించేందుకు వచ్చానన్న పవన్ ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెం, తిమ్మనకుంట గ్రామాల ప్రజలు రోడ్ల సమస్యపై లక్ష్మీనరసింహ స్వామివారి కొండ దిగువన ప్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, పవన్‌కు తెలియజేసేందుకు వస్తే ఇక్కడ కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ధైర్యం చేసి కాన్వాయ్‌కి అడ్డంపడి వినతిపత్రాలు అందించగా, మిగిలిన వారు నిరుత్సాహంగా వెనుదిరిగారు.
ఇవి పరదాలు కావా.. పవన్!
ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రెయినేజీలను పరిశీలించే సమయంలో అక్కడున్న ప్రజలు పవన్‌కళ్యాణ్‌ను కలవాలని ఎంతో ఆశపడ్డారు. కానీ.. అక్కడ వారికి పరదాలు అడ్డొచ్చాయి. వైఎస్ జగన్‌ను పరదాల సీఎం అన్న పవన్ ఇప్పుడు పరదాల మాటున ఎలా పర్యటించారు? ఇవి పరదాలు కావా?– పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి
ప్రజలకు అడ్డుగా బారికేడ్లు
అధికారంలోకి రాకముందు ఎన్నో మాటలు చెప్పిన పవన్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానేశారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ఐఎస్ జగన్నాథపురంలో రహదారులకు ఇరువైపులా బారికేడ్లు పెట్టి మరీ వారిని అడ్డుకున్నారు. – షేక్ అన్సారిబాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శి


