Papikondalu Tour: పాపికొండలు.. షికారుకు సిద్ధం

Papikondalu Tour to Resume After Three Months, Inspection of Boats Completed  - Sakshi

బోట్ల తనిఖీ పూర్తి

వారం రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం

కలెక్టర్‌ ఆమోదమే తరువాయి

టూరిజం శాఖ అధికారుల వెల్లడి 

రంపచోడవరం: గోదావరి వరదలతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్దిరోజుల్లో గ్రీన్‌ సిగ్నల్‌ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్‌ డ్యామ్‌ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో చాలాకాలం పాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. 

గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఏపీ టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గత ఏడాది డిసెంబర్‌ 18న అధికారికంగా పర్యాటకానికి  అనుమతులు ఇచ్చారు. పోలవరం కాపర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు.  

► ప్రస్తుతం కాపర్‌ డ్యామ్‌ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది.   
►జూన్‌ నెలలోనే కాపర్‌డ్యామ్‌ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు.  

ఉపాధిపై ప్రభావం 
పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి పట్టాలెక్కనుండటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.  

బోట్లకు ఎన్‌వోసీ జారీ 
రాష్ట్ర పర్యాటకశాఖ జీఎం నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ వద్ద 12 బోట్లను, వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్‌ పాయింట్‌ వద్ద 17 బోట్లను తనిఖీ చేశారు. వీటికి ఎన్‌వోసీలను కూడా ఇటీవల జారీ చేశారు.  

32 అడుగులకు అనుమతి ఇవ్వాలి 
గోదావరిలో నీటి మట్టం 32 అడుగుల లోపు వరకు పర్యాటక బోట్లు నదిలోకి తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఈమేరకు ఇరిగేషన్‌ అధికారులను కోరాం. 30 అడుగుల వరకు అనుమతి ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. మరో కొద్దిరోజుల్లో పాపికొండల పర్యాటకానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది.  
–కొత్తా రామ్మోహన్‌రావు, బోట్‌ యజమానుల సంఘ ప్రతినిధి 

అనుకూలంగా నీటిమట్టం 
గత మూడు నెలలుగా నిలిచిన పాపికొండలు పర్యాటకం మరో వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ నుంచి అనమతులు మాత్రమే రావాల్సి ఉంది. పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ వద్ద పర్యాటకులు బోట్‌ ఎక్కేందుకు అనువుగా ఉంటే సరిపోతుంది. కాపర్‌ డ్యామ్‌ వద్ద బోట్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది.  
–పి నాగరాజు, ఇన్‌చార్జి, టూరిజం కంట్రోల్‌ రూమ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top