'కరువైన ‘కూటమి’ చేయూత.. బలిపీఠంపై అన్నదాత | Over 250 farmers died in one year of tdp rule | Sakshi
Sakshi News home page

'కరువైన ‘కూటమి’ చేయూత.. బలిపీఠంపై అన్నదాత

Jul 18 2025 4:47 AM | Updated on Jul 18 2025 7:09 AM

Over 250 farmers died in one year of tdp rule

ఏడాది పాలనలో 250 మందికిపైగా రైతుల బలవన్మరణం

ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం 

అందని పెట్టుబడి సాయం.. అదునుకు దొరకని విత్తనాలు, ఎరువులు 

ఏడాదిలో ఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర 

అటకెక్కిన పంటల బీమా... అందని నష్ట పరిహారం.. తడిసి మోపెడవుతున్న అప్పులు.. భారమవుతున్న కుటుంబ పోషణ 

అప్పుల బాధ తాళలేక, ఆదుకునేవారు లేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్న రైతులు  

అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68, అనంతపురంలో 46,వైఎస్సార్‌ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది ఆత్మహత్య 

కానీ, 104 మంది మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం బుకాయింపు 

వ్యక్తిగత కారణాలని చెబుతూ రైతు ఆత్మహత్యలను నమోదు చేయని వైనం.. బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి సర్కారు 

ఐదేళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

అన్నం పెట్టే రైతన్న టీడీపీ కూటమి పాలనలో బలిపీఠంపై ఉన్నాడు..! పంట వేద్దామంటే విత్తనాల కొరత..! సాగైన కాస్త పంటనైనా బతికించు­కుందామంటే ఎరువులు, పురుగు మందులకు కటకట..! పండిన పంటను అమ్ముదాం అంటే మార్కెట్లో ధర లేక యాతన..! చివరకు అప్పులు తీర్చే దారిలేక పంట పొలాల్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. రైతు ఆత్మహత్య వార్త లేని రోజు ఉండడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.

పొలంలోనే పురుగు మందు తాగి..
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రాజారపు పెద్ద యలమందయ్య 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఏటా మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఏడాదిగా పెట్టుబడి సాయం అందకపోవడంతో రూ.3 వడ్డీకి అప్పు తెచ్చాడు. పంటల సాగు కోసం చేసిన అప్పులు రూ.25 లక్షలకు చేరాయి. ఇటీవలే అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికొచ్చి గొడవ చేశాడు. 

‘‘ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టపోయా. వచ్చే సీజన్‌లో ఇచ్చేస్తానంటూ’’ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఏడాదిగా ఇదే చెబుతున్నావనడంతో యలమందయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. జూలై 7న పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు దిక్కెవరంటూ ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో రైతులు గతంలో ఎన్నడూ లేని సం­క్షోభం ఎదుర్కొంటున్నారు. సాగు వేళ వర్షాభా­వ పరిస్థితులు... పంట చేతికొచ్చే సమయంలో తు­పా­న్‌లు, వరదలు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ము­ప్పేట దాడితో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు పాలన–కరువు కవలలు అన్నట్టుగానే గతేడాది నుంచి వరుస వైపరీత్యాలకు తోడు ప్రతి సీజన్‌లో కరువు విలయతాండవం చేస్తోంది. 

అలాంటివారి పాలిట ప్రభుత్వ విధానాలు మత్యుపాశాలయ్యా­యి. కూటమి  పాలనలో...ఏడాదిలో  250 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. వీరి­లో త్రీ­మెన్‌ కమిటీ రైతులుగా నిర్థ్ధారించినది 104 మంది మాత్రమే. వీరిలో ఒక్కరికి కూడా రూ.7 లక్షల పరి­హారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జరి­గిన రైతు ఆత్మహత్యలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు...

సుఖీభవ లేదు.. వడ్డీలకు అప్పులే దిక్కు
ఏడాదిగా పెట్టుబడి సాయం అందక రైతులు పడరా­ని పాట్లు పడుతున్నారు. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు బృందం ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ హామీ ఇచ్చింది. కానీ, తొలి ఏడాది ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇంకా పైసా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,717 కోట్లు కావాలి. 2024–25 బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినా పైసా ఇవ్వలేదు. 2025–26లో పథకానికి రూ.6,300 కోట్లు కేటాయించినా ఒక్క విడత సాయం కూడా జమ చేయలేదు. దీంతో రూ.3–5 వడ్డీకి అప్పులు తెచ్చి మరీ సాగు చేస్తున్నారు.

పరామర్శ లేదు.. సాయం ఊసు లేదు!
పభుత్వ నిర్వాకం, అస్తవ్యస్థ విధానాలతో నిరుడు జూన్‌ 12 నుంచి 250 మందిపైగా ఆత్మహత్యకు పాల్పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యధి­కంగా ఉమ్మడి కర్నూలులో 68, అనంతపురంలో 46, వైఎస్సార్‌ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 104 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోంది. ఇంకో విచిత్రం ఏమంటే గత డిసెంబరు నాటికే 97 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు త్రీమెన్‌ కమిటీ ధ్రువీకరించిందని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లో ఈ సంఖ్యను 60కి కుదించేసింది. పైగా ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు.

ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. వాస్తవానికి రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్‌ వారి ఇంటికెళ్లి ధైర్యాన్నివ్వాలి. అదే రోజు వీఆర్వో వెళ్లి వివరాలు సేకరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి 24 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. 

డివిజన్‌ స్థాయి త్రీమెన్‌ కమిటీ సిఫార్సు మేరకు నిర్దేశిత గడువులోగా పరిహారం అందించేలా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాలి. కానీ, సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడినా, వ్యక్తిగత కారణాలు అంటూ జాబితా నుంచి తప్పించేస్తున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో నివేదికలు కూడా తయారు చేయడం లేదు.

ధరలు దిగదిడుపు.. రైతన్న దిగాలు..
టమాట నుంచి మామిడి వరకు, ధాన్యం నుంచి కందులు దాక, మిర్చి నుంచి పొగాకు వరకు ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసిన కొద్దిపాటిæ పంటకు కనీస మద్దతు ధర దక్కని దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో చేలను దున్నేస్తున్న ఘటనలు నిత్యం చూసూ్తనే ఉన్నాం. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్‌లో కేవలం రూ.300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,725 చెల్లించాల్సి ఉండగా, ఒక్క రైతుకు రూ.1,150–1,450కు మించి దక్కలేదు. ఫైన్‌ వెరైటీస్‌ ధాన్యాన్ని సైతం కనీస మద్దతు ధరకు కొనే నాథుడు లేకుండా పోయారు.

2019–24 మధ్య క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేలకు పైగా పలికిన మిరపకు ఈ ఏడాది రూ.6–10 వేలు మించి దక్కలేదు. గతంలో క్వింటా రూ.18 వేలున్న పొగాకును ఈసారి రూ.5 వేలకు కొనేవారు లేరు. ఇదివరకు కిలో రూ.23–29 పలికిన తోతాపురి మామిడిని రూ.2–4కు మించి కొనే పరిస్థితి లేదు. కోకోకు అంతర్జాతీయంగా మంచి ధర ఉన్నా సిండికేట్‌గా మారి కంపెనీలు చేతులెత్తేశాయి. కానీ, ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ రైతుల నోట్లో మట్టికొట్టింది. ఇక టమాట మరీ ఘోరం. కిలో రూపాయికి కొనేవారు లేక పశువుల మేతగా వదిలేసిన ఘటనలున్నాయి. 

మిరప మద్దతు ధర పేరిట ప్రభుత్వ పెద్దలు ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు. లేఖల పేరిట హంగామా చేసి చివరికి క్వింటా పంటను కూడా మద్దతు ధర రూ.11,781కు కొన్నది పోలేదు. 3–4 దశాబ్దాలు బిడ్డల్లా చూసుకున్న మామిడి తోటలను కొట్టేస్తున్నారు. మద్దతు ధర కోసం ఎన్నడూ లేనివిధంగా ధాన్యం, మిరప, పొగాకు, కోకో, మామిడి ఇలా ప్రతీ రైతు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేయని రోజంటూ లేదు.

ఆర్బీకేలు నిర్వీర్యం.. బీమా ఎగ్గొట్టి... అన్నదాత వెన్ను విరిగ్గొట్టి
సీజన్‌కు ముందే విత్తనాలు, ఎరువులు అందిస్తూ.. పంట విక్రయం దాక అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)ను కూటమి పాలనలో నిర్వీర్యం చేశారు. దీంతో ఏడాదిగా సకాలంలో విత్తనాలు, ఎరువుల దొరక్క అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. నాన్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీ నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో సగం పైగా కోత పెట్టారు. అదునుకు విత్తనాలే కాదు.. ఎరువులూ దొరక్కుండా చేశారు.  మార్కెట్‌లో కల్తీలు రాజ్యమేలుతుండగా.. బ్లాక్‌లో ఎమ్మార్పీకి మించి కొనాల్సిన దుస్థితి ఏర్పడింది.

పంటలకు బీమా ధీమా లేకుండా... ఉచిత బీమాను అటకెక్కించారు. సున్నా వడ్డీ రాయితీ లేకుండా చేశారు. వైపరీత్యాల బారిన పడిన పంటలకు సకాలంలో పరిహారం ఇచ్చిన దాఖలాల్లేవు. న్యాయంగా దక్కాల్సిన పంటల బీమా పరిహారం అందకుండా చేయడంతో పెట్టుబడికి చిల్లిగవ్వ లేక సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. మేమున్నాం అని ధైర్యం చెప్పే ఆపన్న హస్తం లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారు.

అందని పరిహారం.. పడిపోయిన దిగుబడులు
2024–25 ఖరీఫ్, రబీలలో 1.51 కోట్ల ఎకరాలకు గాను సాగైంది 1.24 కోట్ల ఎకరాలే. దాదాపు 27 లక్షల ఎకరాలు బీడు పెట్టారు. వరుస వైపరీత్యాలతో 12 లక్షల ఎకరాల్లో, కరువుతో 9 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో 100, రబీలో 80 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా ప్రభుత్వం ఖరీఫ్‌లో 54, రబీలో 51 మండలాలను కరువు మండలాలుగా మాత్రమే ప్రకటించి చేతులు దు­లుపుకొంది. 

2024–25 సీజన్‌లో వైపరీత్యాలు, కరువు సాయంగా 7 లక్షల మందికి రూ.650 కోట్లకు పైగా పంట నష్ట పరిహారంను (ఇన్‌పుట్‌ సబ్సిడీ) సీజన్‌ ము­గి­సినా చెల్లించలేదు. గత ఖరీఫ్‌లో 174 లక్షల టన్నుల దిగుబడులు అంచనా వే­యగా, 154 లక్షల టన్నులకు పరిమితమైంది. ఉద్యాన పంటలు కూడా భారీగా దె­బ్బతిన్నాయి, పత్తి, మిరప, మామిడిలో కనీస దిగుబడులు రాని పరిస్థితి నెలకొ­ంది.

2014–19 మధ్య సైతం అరకొర సాయం
ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు 2015 ఫిబ్రవరి 18వ తేదీ వరకు రూ.లక్షన్నర చొప్పున పరిహారం ఇవ్వగా, తర్వాత రూ.5 లక్షలకు పెంచారు. ఇందులో రూ.లక్షన్నరను బాధిత రైతుల అప్పుల ఖాతాకు జమ చేసేవారు. రూ.3.5 లక్షలను డిపాజిట్‌ చేసి వడ్డీని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉండగా.. ఐదారు వేల మంది ఆత్మహత్యకు పాల్పడితే గుర్తించింది కేవలం 1,223 మందినే. పరిహారం ఇచ్చింది 450 మందికే. ఇక కౌలు రైతుల ఊసే లేదు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్నకు అన్ని విధాలుగా అండాదండా 
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహా­రాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే..ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబా­లను పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా ఆదుకుంది. ఐదేళ్లలో 1,320 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున రూ.92.40 కోట్లు జమ చేసింది. 

2014–19 మధ్య రైతు ఆత్మహత్య ఘటనలకు సంబంధించి రీ వెరిఫికేషన్‌లో 474 మంది అర్హత పొందగా, రూ.5 లక్షల నేరుగా వారి కుటుంబాల ఖాతా­లకు వేశారు. ఐదేళ్లలో 1,794 మందికి రూ.116.10 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ఇందులో 495 మంది కౌలు రైతులున్నారు. 2014–19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్‌ విచారణ జరపగా, అర్హత పొందిన 474 మందికి రూ.23.70 కోట్లు చెల్లించారు. వీరిలో 212 మంది కౌలు రైతులు. 

ఏడాదిలో రూ.13,212 కోట్లు ఎగ్గొట్టిన బాబు
అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలంటే ఏటా రూ.10,717 కో­ట్లు అవసరం. ఇప్పటికీ దాని ఊసే ఎత్త­డం లేదు. అన్నదాత సుఖీభవ విధివిధానా­ల రూపకల్పన జరగలేదు. 2023–24 సీజ­న్‌కు రూ.930 కోట్ల రైతుల వాటా ప్రీమి­యం సొమ్ములు చెల్లించకపోవడంతో ఆ సీజన్‌లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల  పరి­హా­రం అందకుండా పో­యింది. 

రబీ నుంచి స్వ­చ్ఛంద నమోదు పద్ధతి అమలు చేస్తుండడంతో ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో కరువుతో దెబ్బతిన్న 3.91 లక్షల మందికి రూ.328 కోట్ల కరువు సా­యం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్‌–2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వ­రకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద రూ.650 కోట్లు ఎగ్గొట్టారు. ఇలా ఏడాది­లో అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సు­న్నా వడ్డీ రాయితీలు కలిపి మొత్తమ్మీద రైతుల­కు చె­ల్లించాల్సిన రూ.13,212 కోట్లు ఎగ్గొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement