చిట్‌ఫండ్‌ కంపెనీల్లో కొనసాగుతున్న తనిఖీలు | Sakshi
Sakshi News home page

చిట్‌ఫండ్‌ కంపెనీల్లో కొనసాగుతున్న తనిఖీలు

Published Thu, Nov 17 2022 5:28 AM

Ongoing inspections in chit fund companies Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/తణుకు/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని చిట్‌ఫండ్‌ సంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చిట్‌ల రిజిస్టర్లు, అకౌంట్‌ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పలు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ కంపెనీల ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడంతో వెంటనే సమాచారం రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అనుమానాల నివృత్తి, ఉల్లంఘనలు తెలుసుకునేందుకు తనిఖీ అధికారులకు ఎక్కువ సమయం పడుతోంది.

చిట్స్‌ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లించిన తీరుపై లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. చిట్‌లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరే రకంగా వినియోగించుకున్నట్లు ఈ తనిఖీల్లో స్పష్టమైనట్లు తెలిసింది. గ్యారెంటీ చూపించలేని చందాదారులుఎ పాడుకున్న సొమ్మును ప్రత్యేక ఖాతాల్లో ఉంచి అదే రోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్‌లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టుగా తేలింది. ఈ కంపెనీల నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి.

చిట్‌ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు, ఓచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు నిర్థారించుకున్నట్లు తెలిసింది. జీఎస్‌టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో జీఎస్‌టీ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత సొమ్ము దారి మళ్లింది, ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేర నష్టం కలిగిందనే అంశాలను పూర్తిగా అంచనా వేస్తున్నారు. తనిఖీల్లో అధికారులకు అవసరమైన సమాచారం ఇంకా రావాల్సి ఉండడంతో గురువారం కూడా తనిఖీలు జరిగే అవకాశం ఉంది.  

చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా.. 
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయంలో బుధవారం కూడా తనిఖీలు కొనసాగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. రెండ్రోజులుగా కార్యాలయంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్‌ సొమ్ములు కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీను చెల్లిస్తున్నట్లుగా గుర్తించారు.

మరోవైపు డిపాజిట్‌దారుల నుంచి సేకరించిన మొత్తానికి జీఎస్‌టీ ఎగవేస్తున్నట్లుగా గుర్తించారు. పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నట్టు తేలింది. అలాగే ఏలూరు నగరంలోని నరసింహరావుపేటలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో చిట్స్‌ సబ్‌ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఉదయం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి.  

Advertisement
Advertisement