ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్‌

One Week Break For Krishnapatnam Ayurvedic Medicine Distribution - Sakshi

సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్‌ పడింది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేడో రేపో కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందం రానుంది. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. నేడు రాములు ఎదుట ఆనందయ్య.. ఆయుర్వేద మందు తయారుచేసి చూపించనున్నారు  అధ్యయనం పూర్తైతే ఆనందయ్యకు మందు పంపిణీకి అనుమతి వచ్చే అవకాశం ఉంది.

కాగా, క​రోనా నియంత్రణకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు కోసం ప్రజలు కృష్ణ పట్నం బాటపట్టారు. ఒక వైపు కరోనా వచ్చిన రోగులు, మరో వైపు కరోనా రాకుండా ఉండేందుకు మందు తీసుకునేందుకు వచ్చిన వేలాది మందితో  కృష్ణపట్నం శుక్రవారం కిక్కిరిసింది. కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాలో ప్రచారం రావడంతో దేశ వ్యాప్తంగా డిమాండ్‌ ఏర్పడింది. ఆనందయ్య ఇస్తున్న మందుతో కరోనా తగ్గిపోతుందనే నమ్మకంతో జనం కిలో మీటర్ల వరకు క్యూ కట్టారు. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి ప్రజలు కృష్టపట్నంకు చేరుకున్నారు. జనాల రద్దీతో కిటకిటలాడింది.


ఒక్కసారిగా జనాలు రావడంతో కృష్ణపట్నంకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మందు కోసం సీరియస్‌ కండీషన్‌లో ఉన్న కరోనా బాధితులను అంబులెన్స్‌ల్లో సైతం తీసుకువచ్చారు. మందు కోసం గురువారం రాత్రి నుంచే జనం అక్కడికి చేరుకుని గంటల కొద్దీ నిరీక్షించారు. అయితే తగినంత స్థాయిలో వనమూలికలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. కొన్ని రహదారుల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల్లో జనాలను రాకను కొంత వరకు నియంత్రించారు. అయితే ఆనందయ్య తయారు చేసే మందుకు ఇంత ప్రాధాన్యత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపయోగం జరుగుతుందా అనే ఉద్దేశంతో ఆయుష్‌ శాఖను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి  విదితమే.


కరోనా మందు కోసం ఎవరూ రావొద్దు: ఎస్పీ
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మందు తయారీ, పంపిణీ ఆలస్యం అవుతుందని, ఇతర ప్రాంతాల నుంచి ప్రజల ఎవరూ కృష్ణపట్నంకు రావొద్దని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మందు పంపిణీకి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లా అధికారులు తెలియజేస్తారన్నారు. ఈ మధ్యలో మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నంకు వచ్చి కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

పెద్దాస్పత్రి క్యాజువాలిటీ ఖాళీ  
ప్రతి రోజు కరోనా రోగులు పెద్ద సంఖ్యలో పెద్దాస్పత్రికి చేరుకుని అయ్యా ఒక బెడ్‌ ఇప్పించడంటూ కనిపించిన వారందరిని కాళ్లావేళ్లా పడి వేడుకునే వారు. పెద్దాస్పత్రికి ప్రతి రోజూ సుమారు 200 వరకు అడ్మిషన్లు వస్తాయి. వాస్తవానికి పెద్దాస్పత్రిలో 864 బెడ్స్‌ మాత్రమే ఉన్నాయి. వచ్చే వారిని కాదనలేక 1,000 నుంచి 1,100 మందిని అడ్మిషన్‌ చేర్చుకుని ఎక్కడో ఒక చోట మంచాలు వేసి సర్దుబాటు చేస్తూ వైద్యం చేసేవారు. బెడ్లు చాలక జర్మన్‌ షెడ్లు కూడా వేసి వైద్యం చేస్తున్నారు. అయితే కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న  ఆయుర్వేద మందు  కరోనా జబ్బుకు బాగా పని చేస్తోందని ప్రచారం రావడంతో ప్రజలతో పాటు బాధితులు నమ్మడంతో పెద్దాస్పత్రికి శుక్రవారం ఒక్క సారిగా అడ్మిషన్ల సంఖ్య పడిపోయింది.

కిక్కిరిసి ఉండే క్యాజువాలిటీ ఖాళీ అయింది. ఖాళీ మంచాలు దర్శన మిచ్చాయి. పలువురు బాధితులు ప్రత్యేక వాహనాల్లో కృష్ణపట్నం మందుకు ఉరుకులు, పరుగులు తీశారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు కేవలం 40 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఈ 40 అడ్మిషన్లలో కూడా ఆక్సిజన్‌ పడిపోయిన వారు, ఐసీయూలో ఉండాల్సి వారే అధికం. వార్డుల్లో ఆక్సిజన్‌ బెడ్స్‌పై ఉన్న రోగుల బంధువులు పలువురు కృష్ణపట్నం నుంచి మందు తెచ్చి రోగులకు వినియోగించినట్టు సమాచారం. అయితే కృష్ణపట్నం పోయిన రోగులు మందులు తీసుకుని సాయంత్రానికి మళ్లీ కొంతమంది తిరిగి క్యాజువాలిటీకి  రావడంతో కొంత హడావుడి కనిపించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
ఆయుర్వేద మందు అధ్యయనానికి సీఎం జగన్‌ ఆదేశం

వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు 
   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top