అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు | Obstacles removed for filling posts of Anganwadi Supervisor | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు

Nov 24 2022 3:53 AM | Updated on Nov 24 2022 12:59 PM

Obstacles removed for filling posts of Anganwadi Supervisor - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా, శిశుసంక్షేమశాఖలో అంగన్‌వాడీ వర్కర్లను గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లుగా నియమించేందుకు ఉద్దేశించిన ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. సూపర్‌ వైజర్ల నియామక ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ విషయంలో గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తేసింది. అంగన్‌వాడీ వర్కర్లను సూపర్‌వైజర్లుగా నియమించేందుకు వీలుగా జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగన్‌వాడీ వర్కర్లను గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లుగా నియమించేందుకు వీలుగా 560 పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసి రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు 45 మార్కులు, ఇంగ్లిషులో ప్రావీణ్యానికి 5 మార్కులు నిర్ణయించింది.

కొందరు అభ్యర్థులు తమకు రాతపరీక్ష మాత్రమే నిర్వహించి, ఇంగ్లిషు ప్రావీణ్యపరీక్షను నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇంగ్లిష్‌ ప్రావీణ్యపరీక్ష నిర్వహించకుండానే తుది మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించేందుకు అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. నియామక ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.

ప్రభుత్వ న్యాయవాది శశిభూషణ్‌రావు వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్‌కు అనుగుణంగానే పోస్టుల భర్తీప్రక్రియ చేపట్టామన్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికే ఇంగ్లిష్‌ ప్రావీణ్యపరీక్ష నిర్వహిస్తామని, ఈ విషయాన్ని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. మెమో ద్వారా కూడా స్పష్టతనిచ్చామన్నారు. స్టే వల్ల భర్తీప్రక్రియ మొత్తం నిలిచిపోయిందని, దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ గతంలో విధించిన స్టే ఎత్తేశారు. పిటిషన్లను కొట్టేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement