ఫోను నుంచే ‘ఫారిన్‌’ మనీ.. ఇక విదేశాల నుంచి కూడా డిజిటల్‌ చెల్లింపులు

NRIs From 10 Countries can make UPI payments - Sakshi

డిజిటల్‌ చెల్లింపులు చేయాలంటే.. విదేశాల నుంచి డిజిటల్‌ చెల్లింపులు చేయాలనుకునే ఎన్నారైలకు భారత్‌లో ఏదైనా బ్యాంకులో నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టెర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ) అకౌంట్‌ లేదా నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌వో) అకౌంట్‌ ఉండాలి. ఆ అకౌంట్ల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు పంపించవచ్చు. ఈ–కామర్స్‌ పోర్టళ్లకూ చెల్లింపులు చేయొచ్చు. 

సాక్షి, అమరావతి: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్‌లోని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు డబ్బులు పంపించడం ఇక సులువు కానుంది. విదేశాల నుంచి కూడా చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ నుంచే డిజిటల్‌ (యూపీఐ) చెల్లింపుల ద్వారా నిధులు పంపొచ్చు. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం, భారత్‌ పే తదితర యూపీఐ పేమెంట్‌ మాధ్యమాల ద్వారా క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నుంచి డిజిటల్‌ చెల్లింపులను అనుమతిస్తారు. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) విధి విధానాలను ఖరారు చేసింది. ఈ తాజా విధాన నిర్ణయం 1.35 కోట్ల మంది ఎన్నారైలకు సౌలభ్యంగా మారనుంది.

తొలి దశలో 10 దేశాలకు అనుమతి 
తొలి దశలో ఎన్నారైలు అధికంగా ఉన్న 10 దేశాల నుంచి చెల్లింపులకు ఎన్‌పీసీఐ అనుమతి మంజూరు చేసింది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా నుంచి డిజిటల్‌ చెల్లింపులు చేయొచ్చు. విదేశాల నుంచి యూపీఐ చెల్లింపుల కోసం ఎన్‌పీసీఐ 2020లోనే ప్రత్యేకంగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విదేశాల్లోని డిజిటల్‌ పేమెంట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటికే నేపాల్, యూఏఈ, యూకే, ఫ్రాన్స్‌లలోని సంస్థలు భారతీయ యూపీఏ చెల్లింపులను అనుమతించేలా ఒప్పందాలు చేసుకుంది. మన యూపీఐని సింగపూర్‌ పేనౌ సంస్థతో అనుసంధానించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పుడు నేరుగా భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులకు అనుమతించింది. 

ప్రస్తుతం నగదు బదిలీకి 48 గంటలు 
ప్రస్తుతం ఎన్నారైలు భారత్‌లోని బంధువులకు అక్కడి బ్యాంకు ఖాతా నుంచి భారత్‌లోని బ్యాంకు ఖాతాకు నగదు పంపిస్తున్నారు. దీన్ని వైర్‌ ట్రాన్స్‌ఫర్‌ అంటారు. ఈ విధానంలో నగదు బదిలీకి 48 గంటల సమయం పడుతుంది. ఇక వెస్ట్రన్‌ యూనియన్, యూఏఈ ఎక్సే్ఛంజ్‌ వంటి మనీ ట్రాన్స్‌ఫర్‌ కంపెనీల ద్వారా పంపాలంటే విదేశాల్లోని మనీ ట్రాన్స్‌ఫర్‌ కంపెనీ ఆఫీసుకు వెళ్లి ఆ దేశం కరెన్సీని చెల్లించాలి. ఆ రోజుకు మనీ ట్రాన్స్‌ఫర్‌ కంపెనీ నిర్దేశించిన మారక విలువనుబట్టి భారత్‌లో ఉన్న వారికి భారత కరెన్సీలో నగదు చెల్లిస్తారు. ఇవి కాకుండా మరికొన్ని ఆన్‌లైన్‌ చెల్లింపు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవి డబ్బులు పంపేవారు, పొందేవారు ఇద్దరి నుంచి ఎక్కువ మొత్తంలో సర్వీస్‌ చార్జి వసూలు చేస్తాయి. 

మనీ లాండరింగ్‌కు అవకాశం లేకుండా.. 
విదేశాల నుంచి డిజిటల్‌ చెల్లింపులపై భారత్‌లోని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఫారిన్‌ ఎక్సే్చంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా)కు కట్టుబడిన బ్యాంకు అకౌంట్లకే డిజిటల్‌ చెల్లింపులకు అనుమతించాలని స్పష్టం చేసింది. డబ్బు­లు చెల్లించే ఖాతా ఉన్న బ్యాంకు, డబ్బులు తీసుకునే ఖాతా ఉన్న బ్యాంకు కచ్చితంగా విదేశాల నుంచి డిజిటల్‌ చెల్లింపు లావాదేవీలు దేశంలోని మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి అనుగుణంగా ఉన్నాయ­నే విష­యాన్ని నిర్ధారించుకోవాలి. ఆర్థిక ఉ­గ్రవాద నిరోధక చట్టాన్ని కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

డిజిటల్‌ చెల్లింపులకు మరింత ఊపు.. 
ఎన్‌పీసీఐ తాజా నిర్ణయంతో దేశీయ బ్యాంకుల ద్వారా డిజిటల్‌ పేమెంట్లు మరింతగా పెరగనున్నాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కానీ 2016లో పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) తరువాత నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. అప్పటి నుంచి ఇవి భారీగా పెరిగాయి. 2000లో దేశంలో రూ.4.2 లక్షల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు జరగ్గా, 2022లో ఏకంగా రూ.12.8 లక్షల కోట్ల చెల్లింపులు జరగడం విశేషం. విదేశాల నుంచి కూడా డిజిటల్‌ చెల్లింపులు మొదలైతే వీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. 

విదేశాల నుంచి నిధుల్లో భారత్‌దే అగ్రస్థానం 
విదేశాల్లో ఉన్న వారి నుంచి స్వదేశానికి వస్తున్న నిధుల్లో ప్రపంచంలో భారత్‌దే మొదటిస్థానం. 2021లో ఎన్నారైలు భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు రూ.7.15 లక్షల కోట్లు పంపించగా.. 2022లో రూ.8 లక్షల కోట్లు పంపించారు. అందులో 25 శాతం గల్ఫ్‌ దేశాల నుంచి, 20 శాతం అమెరికా నుంచి వచ్చాయి. డిజిటల్‌ చెల్లింపులకు అనుమతించడంతో ఈ నిధుల వరద మరింతగా పెరగనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top