న్యాయాధికారుల పనితీరుపై ఏసీఆర్ రూపకల్పనలో తస్మాత్ జాగ్రత్త
ఓ న్యాయాధికారి వ్యాజ్యంలో రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: న్యాయాధికారుల పనితీరు, సమర్థత, నిజాయితీ తదితరాల మదింపునకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికల (ఏసీఆర్) తయారీ విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. న్యాయాధికారులపై ఏసీఆర్‌ల రూపకల్పన విషయంలో కేవలం జిల్లా ప్రధాన జడ్జిలు ఇచ్చే సమాచారానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర మార్గాల్లో కూడా సమాచారాన్ని తెప్పించుకుని, రెండింటినీ సరిచూసుకోవాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.
ఏసీఆర్‌లో ప్రతికూల అభిప్రాయాల నమోదు సందర్భంలో అత్యంత జాగరూకత అవసరమని, ఈ నమోదు ఏకపక్షంగా ఉండకూడదని ఉద్ఘాటించింది. ‘పలు కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, సహచరులు, కక్షిదారులు న్యాయాధికారుల నిజాయితీపై ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నచ్చని తీర్పునిచ్చారన్న కారణంతో న్యాయవాదులు, కక్షిదారులు నిజాయితీపరులైన న్యాయాధికారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
అలాంటి ఫిర్యాదులపై విచారణ విషయంతో పాటు నిజాయితీపరులైన న్యాయాధికారులను రక్షించే విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు సమతుల్యత పాటిస్తున్నారు’ అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే తనకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలో పేర్కొన్న ప్రతికూల అభిప్రాయాలను తొలగించాలన్న తన వినతిని తిరస్కరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ విజయబాబు అనే న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
విజయబాబు నిజాయితీ సందేహాస్పదమా? కాదా? అన్న విషయంపై న్యాయమూర్తులతో కూడిన రివ్యూ కమిటీ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా తాము తమ నిర్ణయాన్ని చెప్పలేమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
న్యాయాధికారి వ్యాజ్యం వివరాలు..
జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్.విజయబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు చోట్ల పనిచేశారు. ఆయనకు సంబంధించిన 2009 వార్షిక నివేదికలో ప్రతికూల అభిప్రాయాలను పొందుపరిచారు. అయితే ఏ ప్రాతిపదికన తన ఏసీఆర్‌లో ప్రతికూల అభిప్రాయాలు పొందుపరిచారో చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో రిజి్రస్టార్ ఏసీఆర్ తయారీ విషయంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందుంచిన ఆధారాలను విజయబాబుకు అందచేశారు.
నల్గొండ జిల్లాలో పనిచేసే సమయంలో అప్పటి జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికతో పాటు అప్పటికి పెండింగ్‌లో ఉన్న రెండు శాఖాపరమైన విచారణలను ఆధారంగా చేసుకుని ఏసీఆర్‌లో ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు విజయబాబు గుర్తించారు. అటు తరువాత విజయబాబుపై ఉన్న ఆ రెండు శాఖాపరమైన విచారణలను హైకోర్టు 2012లో రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో విజయబాబు 2009 ఏసీఆర్‌లో పొందుపరిచిన ప్రతికూల అభిప్రాయాలను పునః సమీక్షించాలని కోరారు. ఈ అభ్యర్థనను రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో తిరస్కరించారు. దీంతో ఆయన అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయబాబు తరఫున న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, విజయబాబుపై ఉన్న విచారణలను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.


