‘పోలవరం నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదు’

No Problem With Polavaram Funds Says Center - Sakshi

సాక్షి, ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ క్యాబినెట్ నోట్‌లో 2013-14 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే నిర్ణయం జరిగిందన్నారు. పోలవరం నిధులపై రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. 2022 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. నిధుల విడుదలలో ఆలస్యం వల్ల ప్రాజెక్టు పనులపై ప్రభావం పడుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు.  నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017 లెక్కల ప్రకారం అంచనాలను తయారు చేసిందన్నారు. దీనిని పరిశీలించి క్యాబినెట్ నిర్ణయానికి పంపుతామని తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం సవరించిన అంచనాలపై ముందుకు వెళ్తామని, నిధులు విడుదల విషయంలో ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు రియింబర్స్‌మెంట్‌ పద్దతిలో పూర్తి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఆర్అండ్‌ఆర్‌ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచాలని పేర్కొన్న మంత్రి దీనిని బట్టి ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. మరో మూడు నెలల్లో స్పిల్వే పనులు పూర్తవుతాయని, కాపర్ డ్యాం తయారైన తర్వాత 41 మీటర్ లెవల్‌లో నీళ్లను నిల్వ చేస్తామని అన్నారు. 

లక్ష ఎకరాల భూమి పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతుందని, 41 మీటర్ల లెవల్‌లో నీళ్ళు నిల్వ చేసినప్పుడు నిర్వాసితులు అయ్యే వారికి తొలి విడతలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. 35 శాతం మంది ప్రజలను అక్కడి నుంచి వేరేచోటికి తరలించామని, మిగిలిన వారికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.పోలవరం ప్రాజెక్టుకు 10848 కోట్లు  చేసినందుకు  కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో ఎంత భూమి మునిగిపోతుందని తెలపాలని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అడిగారు. ఎంతమంది  మంది నిర్వాసితులయ్యారో,  ఎంతమందికి సెటిల్మెంట్ చేశారో చెప్పాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top