
విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ప్రాధమిక అధ్యయనం జరుగుతున్నట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ తెలిపారు.
సాక్షి, ఢిల్లీ: విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనం జరుగుతున్నట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలోని 35 నగరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహాల కేబినెట్ కమిటీ ఆదేశించింది. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు గుర్తించిన నగరాలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి.
ఎంఎంఎల్‌పీ అభివృద్ధి చేయడానికి ముందు ఆ ప్రాంతంలో సప్లై, డిమాండ్‌తో పాటు ఆచరణ సాధ్యతను అంచనా వేయడానికి ప్రాథమిక అధ్యయనం జరుగుతుందని మంత్రి తెలిపారు. విజయవాడలో ఎంఎంఎల్‌పీ ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనం పూర్తయింది. ప్రస్తుతం అక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు ఆశించినంత డిమాండ్ లేనట్లు అధ్యయనంలో వెల్లడైందని మంత్రి చెప్పారు. ఇక విశాఖపట్నానికి సంబంధించి ఈ తరహా ప్రాథమిక అధ్యయనం కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.