ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Nitin Gadkari at the inauguration of Benz Circle and Kanakadurga flyover - Sakshi

బెంజి సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ  

నాగపూర్‌ నుంచి గడ్కరీ, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు వీకే సింగ్, జి.కిషన్‌ రెడ్డి, తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగాలు    

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల పరిస్థితులున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌లను జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట్రంలో రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు భూమి పూజ, శిలాఫలకాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. శుక్రవారం నాగపూర్‌ నుంచి గడ్కరీ, ఢిల్లీ నుంచి కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్‌ జనరల్‌ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ చేసిన పలు ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. గడ్కరీ ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి.   

రూ.8,869 కోట్లతో 28 ప్రాజెక్టులు 
► ఏపీలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 2014లో మేము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఈ అయిదేళ్లలో కొత్తగా 2,667 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 
► రాష్ట్రంలో రూ.8,869 కోట్లతో మొత్తం 28 ప్రాజెక్టులు చేపడుతున్నాం. 2,209 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.32,175 కోట్లు వ్యయం కానుంది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తుది దశలో ఉంది. వచ్చే ఏడాదిలో పనులు మొదలవుతాయి. 
► రూ.5 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యే బెంగళూరు–చెన్నై హైవే ఏపీకి ఎంతో కీలకం. పోర్టు కనెక్టివిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తాం. ఆ జాబితా ఇప్పటికే మా దగ్గర ఉంది. ఆ మేరకు పనులు చేపడతాము. 
► అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే పనులు నాలుగు జిల్లాలలో కొనసాగుతాయి. అదే విధంగా విజయవాడ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా చేపడదాం. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మీరు (సీఎం జగన్‌) ఢిల్లీకి రండి. అక్కడ అన్నీ చర్చిద్దాం. 
► భూసేకరణలో మీ వాటా 50 శాతం కొంత భారం అంటున్నారు కాబట్టి, రోడ్డు నిర్మాణంలో వాడే వాటి మీద మైనింగ్‌ సెస్‌ లేక రాయల్టీ, స్టీల్, సిమెంట్‌ వంటి వాటిపై జీఎస్టీలో మినహాయింపు ఇవ్వండి. తద్వారా కేంద్రంపై ప్రాజెక్టు భారం కాస్త తగ్గుతుంది.  
► విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఇవాళ దేశానికే గర్వకారణం. నేను కూడా చూశాను. అమ్మవారిని దర్శించుకున్నాను. 
► దేశంలో ఏటా 5 లక్షల ప్రమాదాల్లో లక్ష మంది చనిపోతున్నారు. ఏపీలో కూడా బ్లాక్‌ స్పాట్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇప్పటికే మార్చాం. అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. 

ఉపాధి కల్పనకు ప్రాధాన్యత 
► ఏపీలో మరింత ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎంఎస్‌ఎంఈ, ఖాదీ పరిశ్రమలకు మేము పూర్తి అండగా నిలుస్తాం. ఎంఎస్‌ఎంఈ మంత్రిగా చెబుతున్నాను. చేనేత, హస్తకళల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇక్కడ వాటికి కొదవ లేదు. 
► రాష్ట్రంలో ఉన్న పోర్టులు కూడా అభివృద్ధిలో ఎంతో దోహదం చేస్తున్నాయి. మీ (సీఎం) విజ్ఞప్తులకు పూర్తి అండగా నిలుస్తాం. వచ్చే నెలలో నేను ఢిల్లీకి వస్తాను. మీరూ, అధికారులు రండి. మీ ఎంపీలు కూడా నన్ను కలుస్తున్నారు. మీరు ఢిల్లీకి వస్తే, అన్నీ మాట్లాడుకుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. 
► ఈ కార్యక్రమంలో తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌ నుంచి రాష్ట్ర మంత్రులు ఎం.శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, జాతీయ రహదారుల అథారిటీ అధికారులు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.  

రహదారుల నెట్‌వర్క్‌కు ఏపీ హబ్‌ 
దేశంలో అనేక రహదారుల నెట్‌వర్క్‌కు ఆంధ్రప్రదేశ్‌ హబ్‌గా ఉంది. దీని వల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది.   
– వీకే సింగ్, కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి  

ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి 
నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వల్ల విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తొలగిపోతుంది. రాష్ట్రంలో ఇంకా చాలా కేంద్ర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారు. ఇందుకు మంత్రి గడ్కరీ ఎంతో సహకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు.  
– జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top