మంత్రుల పర్యటనలకు ప్రభుత్వ వాహనాలొద్దు

Nimmagadda Ramesh Kumar Another Letter To CS Adityanath Das - Sakshi

వారి వెంట ప్రభుత్వ సిబ్బందీ ఉండకూడదు 

సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ 

సాక్షి, అమరావతి : పార్టీయేతర ప్రాతిపదికన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులెవరూ పల్లెల్లో పర్యటించే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వోద్యోగులెవరినీ వెంట తీసుకెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వ వాహనాలతో సహా ఇతరత్రా ఏ ప్రభుత్వ సదుపాయాలను వారు వినియోగించకూడదని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కోడ్‌ అమలులో ఉందని.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ వాహనాలను సమకూర్చవద్దని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఏ ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందకూడదని స్పష్టంచేశారు. అంతేకాక.. కేబినెట్‌ ర్యాంకు హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా ఉండే వారు పార్టీ కార్యాలయాలకు వెళ్లి రావడానికి కూడా ప్రభుత్వ వాహనాలు వినియోగించుకోకూడదని.. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ పార్టీకి సంబంధించిన ప్రెస్‌మీట్లలోనూ పాల్గొనడం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఆ లేఖలో సీఎస్‌కు వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top