కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు నవవధువు | Newlywed Bride dies in Car Accident Near Aganampudi | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు నవవధువు

May 14 2026 6:25 PM | Updated on May 14 2026 7:40 PM

Newlywed Bride dies in Car Accident Near Aganampudi

సాక్షి,విశాఖ: వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని బంగారు జీవితం గడపాలని కలలు కన్నారు. కానీ ఆ దంపతుల ఆశలు అడియాసలయ్యాయి. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది. వరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వధువు, వరుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి మృతి చెందగా, వరుడు నర్సింగరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బుధవారం రాత్రి 1.58 గంటలకు వాడచీపురు పల్లిలో రామేశ్వరి - నర్సింగరావు వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం జరిగిన కొన్ని గంటలకే గురువారం అత్తగారిల్లైన అగనంపూడికి బయల్దేరారు. మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. రాత్రి పెళ్లి, మరుసటి రోజు ప్రమాదంలో వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఘనంగా పెళ్లి చేసి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి సాగనంపిన తల్లిదండ్రులు, ఆమె మృతదేహాన్ని చూసి గుండెలవేసిలా రోదిస్తున్నారు. ఈ దృశ్యం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement