నెలాఖర్లో ఎన్‌డీబీ రీ టెండర్లు 

NDB Re Tenders In The Of September - Sakshi

ఈలోగా అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు  

ఇది విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టు  

అందుకే ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్న సర్కారు 

ఈసారి జాయింట్‌ వెంచర్‌ కంపెనీలకూ అనుమతి 

దీంతో చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు పాల్గొనేందుకు అవకాశం 

పాత టెండర్ల ప్రక్రియ పక్కాగానే జరిగినా పారదర్శకత కోసమే రీటెండర్లు 

సాక్షి, అమరావతి: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి సంబంధించిన రీటెండర్ల ప్రక్రియను ఆర్‌ అండ్‌ బీ శాఖ ఈ నెలాఖరున నిర్వహించనుంది. రద్దయిన టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మళ్లీ జారీచేయనున్నారు. ఈలోపు రీటెండర్లలో ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు పాల్గొనేలా అధికారులు అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లతో వెబినార్, ఈ–మెయిళ్ల ద్వారా చర్చించాలని నిర్ణయించారు. ఎన్‌డీబీ సహకారంతో మొత్తం రూ.6,400 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా రాస్తున్న అసత్య కథనాలకు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ఆర్‌ అండ్‌ బీ ముఖ్య అధికారులతో టెండర్ల విషయమై సమీక్షించారు. టెండర్లలో పోటీతత్వం పెంచాలని.. పారదర్శకత ప్రతిబింబించాలని, ప్రజల్లో ఎక్కడా అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన ఆదేశించడంతో టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. కాగా,  టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొని ఎక్కవ సంఖ్యలో బిడ్లు వేస్తే ఆ మొత్తంతోనే ఇంకొన్ని ఎక్కువ రహదారులు నిర్మించవచ్చు. 

రీటెండర్ల విధివిధానాలివే.. 
► బ్యాంక్‌ గ్యారెంటీ కోసం కాంట్రాక్టు సంస్థలు హార్డ్‌ కాపీ ఇవ్వాలి.  
► జ్యుడీషియల్‌ ప్రివ్యూ సూచనల మేరకు జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలి.  
► చిన్న కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా జాయింట్‌ వెంచర్‌ కంపెనీలకు అవకాశం ఉంది.  
► విదేశీ రుణంతో చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా.. ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్‌ విధానం అనుసరించాల్సిందే. 
► ఏపీలో రాజమండ్రి–విజయనగరం హైవే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్‌ విధానమే అనుసరిస్తోంది.  

నిజానికి టెండర్ల రద్దు అక్కర్లేదు 
► ఇప్పటికే దాఖలైన బిడ్లతో ముందుకు వెళ్లొచ్చు. రద్దు చేయవలసిన అవసరంలేదు. ఎన్‌డీబీ కూడా ప్రస్తుత బిడ్లపై సంతృప్తి వ్యక్తంచేసింది. గతంలో కూడా ఎక్కువ విలువ ఉన్న పనుల్లో కొన్ని సంస్థలే పాల్గొన్నాయి. విజయవాడ బైపాస్‌ రోడ్డు పనుల్లో కూడా ఒకటి, రెండు సంస్థలే పాల్గొన్నాయి. కానీ, పారదర్శకత కోసమే ప్రభుత్వం రీటెండర్లకు ఆదేశించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top