వైఎస్‌ జగన్‌ పథకాలు దేశానికే ఆదర్శం

Nazir Ahmed Comments About YS YS Jagan Schemes - Sakshi

ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం

జమ్మూ–కశ్మీర్‌ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు నజీర్‌ అహమ్మద్‌ ప్రశంస

చిత్తూరు జిల్లా కల్లూరులో కమిటీ పర్యటన 

కల్లూరు/పులిచెర్ల/తిరుమల (చిత్తూరు జిల్లా): దేశంలోనే ఎక్కడా లేని అద్భుతమైన పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, జమ్మూ–కశ్మీర్‌ ఎంపీ నజీర్‌ అహమ్మద్‌ కొనియాడారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లూరులో ఎస్‌హెచ్‌జీ గ్రూపులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నజీర్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం హర్షణీయమన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యం చేశారని ప్రశంసించారు.

ఇటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ గొప్పగా ఉందని ప్రశంసించారు. పర్యటనలో భాగంగా దిగువపోకల వారిపల్లెలో వాటర్‌షెడ్‌లో చేపట్టిన చెక్‌ డ్యాంను కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ చైర్మన్‌ ప్రతాప్‌రావ్‌ జాదవ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, నజీర్‌ అహమ్మద్, తలారి రంగయ్య, రాష్ట్ర ఈజీఎస్‌ డైరెక్టరు చిన్నతాతయ్య, జాయింట్‌ కలెక్టరు మార్కండేయులు, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎన్‌ఆర్‌జీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడు విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, కల్లూరులో పర్యటనకు ముందు తిరుమల శ్రీవారిని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top