శ్రీవారి కోసం 365 రకాల దేశీ వరి!

Natural Farming: 365 Domestic Rice Varieties Used For TTD Prasadam Making - Sakshi

తిరుమల ఆలయంలో నైవేద్యం కోసం 365 రకాల దేశీ వరి సాగు

ఒక్కో రైతుకు ఒక్కో రకం విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు 

పోషకాలతోపాటు ఔషధ విలువలు కలిగిన దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమంలో తెలుగు నాట కొత్త శకం ఆరంభమైంది. దేశీ వరి బియ్యాన్ని మాత్రమే శ్రీవారి నైవేద్యానికి వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల నిర్ణయించింది. మే 1 నుంచి తిరుమలలో శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన దేశీ వరి బియ్యంతో రోజూ 8 రకాల ప్రసాదాలను తయారు చేసి నైవేద్యం పెడుతున్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవవి నుంచి రోజుకో దేశీ వరి రకం బియ్యంతో తిరుమలలో శ్రీవారికి నైవేద్యం అందించాలన్నది సంకల్పం. 

60 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ సంప్రదాయాన్ని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పునరుద్ధరిండం విశేషం. టీటీడీ పాలక మండలి సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్‌ అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్, ‘సేవ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, దేశీ వరి రకాల పరిరక్షణ ఉద్యమకారుడు ఎం. విజయరామ్‌ సంయుక్త కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది.

ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సబర్మతి నుంచి సేకరించిన 365 రకాల దేశీ వరి విత్తనాలను జూన్‌ నెలలో ఒక్కో రైతుకు ఒక్కో రకం విత్తనాన్ని అందించడానికి ‘సేవ్‌’ సంస్థ ఏర్పాట్లు చేసింది. 2–3 ఏళ్లుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని విజయరామ్‌ అన్నారు. నవారా, కాలాభట్‌ తప్ప మిగతా రకాలు ఎకరానికి 18–23 బస్తాల ధాన్యం దిగుబడి ప్రకృతి వ్యవసాయం ద్వారా వస్తుందని, 20 బస్తాలు పండితే వెయ్యి కిలోల బియ్యం వస్తాయన్నారు. టీటీడీపై ఆర్థిక భారం పడకుండానే రైతులు, దాతల ద్వారానే శ్రీవారి నైవేద్యానికి రోజుకో రకం దేశీ వరి బియ్యాన్ని అందించాలనేది సంకల్పం. ముందస్తు ఒప్పందం మేరకు రైతుల నుంచి దాతలు కిలో బియ్యం రూ. 60–70లకు సేకరించి, సొంత రవాణా ఖర్చులతో టీటీడీకి అందజేస్తారన్నారు.   

ఎవరిని సంప్రదించాలి?
దేశీ వరి వంగడాలను భక్తి శ్రద్ధలతో గోఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ (ఇందిరా పార్కు వద్ద, రామకృష్ణ మఠం ఎదురుగా) లో గల ‘సేవ్‌’ సంస్థ కార్యాలయం (040–27654337)లో సంప్రదించవచ్చు. 

గో ఆధారిత ఉత్పత్తులనూ ప్రోత్సహించాలి
అపురూపమైన దేశీ వరి వంగడాలు అంతరించిపోకుండా కాపాడటానికి టీటీడీ నిర్ణయం దోహదపడుతుంది. 2022 శ్రీరామనవవి నుంచి రోజుకో రకం దేశీ వరి బియ్యాన్ని శ్రీవారి నైవేద్యానికి అందించనున్నాం. గో ఆధారిత ఉత్పత్తులను కూడా టీటీడీ ప్రోత్సహించాలి. ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలి. 
– ఎం. విజయరామ్, ‘సేవ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు  letssave@gmail.com

గోవిందునికి గోమహానైవేద్యం
గోవిందునికి శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో మాదిరిగా గోమహానైవేద్యం పెట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం శుభపరిణామం. ప్రతి రైతూ ఇందులో భాగస్వాములు కావాలి. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనూ దేశీ వరి బియ్యాన్నే వాడాలి. దేవాలయాలన్నిటిలోనూ నైవేద్యానికి దేశీ వరి బియ్యాన్నే వాడాలి. 
– కొలిశెట్టి శివకుమార్, 
టీటీడీ పాలక మండలి సభ్యులు, 
యుగ తులసి ఫౌండేషన్‌ చైర్మన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top