సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.
1935 జూన్ 23న గుంటూరు జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ (బ్రిటిష్ ఇండియా)లో నాదెండ్ల భాస్కర్‌రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ చేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. అటుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 11వ సీఎంగా అత్యంత తక్కువ కాలం పని చేశారు.
నాదెండ్ల భాస్కరరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. తెలుగు దేశం పార్టీ స్థాపనలో ఎన్టీఆర్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. భాస్కరరావు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో, కాంగ్రెస్ మద్దతుతో ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు. ఇది రాజకీయ దుమారం రేపింది. అయితే..
ఆ తర్వాత ధర్మ యుద్ధం పేరిట పోరాటం చేసి ఎన్టీఆర్ తిరిగి అధికారం దక్కించుకున్నారు. తద్వారా 1984లో కేవలం 31 రోజులపాటే ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్‌రావు పనిచేసినట్లైంది. తెలుగు దేశం పార్టీ నుంచి బహిష్కరించాక నాదెండ్ల కాంగ్రెస్‌లో చేరారు. అటుపై ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 12వ లోక్‌సభ సభ్యుడిగా నెగ్గారు. 2019లో కాంగ్రెస్‌ను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు.



