
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్‌లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు.
మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.