పరువు కోసం తల్లి, ప్రేమ కోసం కూతురు బలవన్మరణం

Mother And Daughter Commit Suicide In Guntur District - Sakshi

పెదకూరపాడు: పరువు కోసం తల్లి, ప్రేమ కోసం కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను బయట సంబంధాలకు ఇస్తే కాపురం ఎలా ఉంటుందో అన్న భయతో సొంత తమ్ముడికే ఇచ్చి వివాహం చేసింది ఆ తల్లి. భార్యగా వచ్చిన మేనకోడలిని ఆమె కోరిక మేరకు డిగ్రీ చదివిస్తున్నాడు భర్త. నిత్యం 25 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు. ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. భార్య ప్రేమ వ్యవహారం ఆ కుటుంబంలో కలకలం రేపింది. ఈ విషయమై తల్లీకుమార్తెల మధ్య గొడవ జరిగింది. తెల్లవారే సరికి ఇద్దరూ మృతిచెందడంతో పండగ పూట విషాదం నెలకొంది.

పోలీసుల కథనం మేరకు.. పెదకూరపాడు మండలంలోని బుస్సాపురం గ్రామానికి చెందిన యువకుడికి గత ఏడాది అతని సోదరి కట్లగుంట నాగవర్థిని (40) కుమార్తె దివ్య సాయిశ్రీ(20)తో వివాహమైంది. అప్పటికే దివ్యసాయిశ్రీ సత్తెనపల్లిలో డిగ్రీ (బీఎస్‌సీ) రెండో సంవత్సరం చదువుతోంది. దివ్యసాయిశ్రీ భర్త కూడా సత్తెనపల్లిలోనే ఇనుము, సింమెట్‌ షాపులో పని చేస్తున్నాడు. అతను  రోజూ భార్యను కాలేజీ వద్ద వదిలి తన విధులకు వెళ్లేవాడు. సాయంత్రం భార్యతో కలిసి బుస్సాపురం వచ్చేవాడు.

ఈ క్రమంలో ఈ నెల పదో తేదీన పరీక్ష ఉండటంతో భార్యను కాలేజీ వద్ద వదిలి వెళ్లాడు. సాయంత్రం కాలేజీ వద్దకు రాగా భార్య కనిపించలేదు. ఆమె స్నేహితులను విచారించగా దివ్యసాయిశ్రీ తనతో కలిసి చదువుతున్న వ్యక్తిని ప్రేమిస్తోందని, అతడితో కలిసి వెళ్లిందని చెప్పారు. దివ్యసాయిశ్రీ భర్త పాత గుంటూరులో నివసిస్తున్న తన సోదరి నాగవర్థినికి ఈ విషయం చెప్పాడు. ఈ క్రమంలో దివ్యసాయిశ్రీని ప్రేమించిన వ్యక్తి కుటుంబ సభ్యులు పెళ్లయిన అమ్మాయితో ప్రేమ ఏమిటని మందలించారు. దివ్య సాయిశ్రీ తమ వద్దే ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పెదకూరపాడు పోలీసు స్టేషన్‌లో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇరువైపుల వారిని ఇంటికి పంపారు. 

పురుగు మందుతాగి ఆత్మహత్య 
కుమార్తె దివ్యసాయిశ్రీని తీసుకొని నాగవర్థిని సోమవారం తమ్ముడి ఇంటికి వచ్చింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి దివ్యసాయిశ్రీ, నాగవర్థిని ఇంటిపై నిద్రించారు. ఈ క్రమంలో దివ్యసాయిశ్రీ భర్త తన తల్లి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన బాబాయితో కలిసి తన ఇంటిపైకి వెళ్లే సరికి తన సోదరి, భార్య అచేతనంగా పడి ఉండటం, వారి వద్ద పురుగు మందు వాసన రావడంతో స్థానికుల సహాయంతో పెదకూరపాడు వైద్యశాలకు తీసుకెళ్లారు. పెదకూరపాడులో వైద్యులు లేకపోవడంతో సత్తెనపల్లి ప్రైవెట్‌ వైద్యశాలకు తరలించగా అప్పటికే తల్లీకుమార్తెలు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ పట్టాభిరామ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ.. 
ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న బాలికపై అత్యాచారం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top