
రాష్ట గిరిజన జాతరగా గుర్తింపు
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఈ నెల 11వతేదీ నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సమ్మక్క, సారలమ్మ వనదేవతల గిరిజన జాతర తరువాత పాడేరు మోదకొండమ్మ జాతర రెండవ గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది.
రాష్ట్ర విభజన అనంతరం మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర గిరిజన జాతరగా ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మోదకొండమ్మతల్లి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కమిటీ ప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. పట్టణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.