
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం వెసులుబాటు కల్పించినా..యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అందువల్ల తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. బుధవారం విజయవాడలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హాళ్లు నడవాలంటే రూ.లక్షల్లో అదనంగా ఖర్చవుతుందని ప్రతినిధులు వెల్లడించారు.
కేంద్రం ప్రకటించిన 24 నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఒక్కో ప్రేక్షకుడిపై రూ.25 అదనపు భారం పడనుందని వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఫిక్స్‌డ్ చార్జీల రద్దు, ఇతర రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు చేసినట్లయితే సినిమా హాళ్లు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నారాయణబాబు, రామా టాకీస్ సాయి, రమేష్, ప్రసాద్, రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.