AP: ‘ధర’హాసం.. రైతులకు ఎమ్మెస్పీ కంటే మిన్నగా మార్కెట్‌ రేట్లు

Market Rates Are Better Than MSP For AP Farmers - Sakshi

ధరలు తగ్గిన ప్రతిసారీ మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం

వ్యాపారుల మధ్య పోటీ పెరిగేలా తక్షణమే పంట కొనుగోలు

ఇందుకోసం ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

ఈ ఏడాది పత్తి, మిరప, మినుము, వేరుశనగ పంటలకు రికార్డు స్థాయిలో ధర

సాక్షి, అమరావతి: కనీస మద్దతు ధర కూడా లభిం­చక ఏ ఒక్క రైతు కూడా నష్టపో­కూడదని రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తద్వారా వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి రికార్డు స్థాయి రేట్లు పలుకుతున్నాయి. ధర తగ్గిన ప్రతిసారి ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకుని, అధిక ధరకు పంట కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారులు కూడా అదే ధరకు కొనాల్సిన పరిస్థితి కల్పించింది.

దీంతో వ్యాపారుల మధ్య పోటీని పెంచగలిగింది. ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడల్లా పంటలు కొనుగోలు చేస్తోంది. ఫలితంగా మార్కెట్‌లో ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. పత్తి, మిరప, వేరుశనగ, సజ్జలు, మొక్కజొన్నకు ఎమ్మెస్పీకి మించి లభిస్తోంది. పొగాకు సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలైన జొన్నలు,  రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుము, పసుపు, ఉల్లి, టమాటాకు మద్దతు ధర కల్పించింది.

మార్క్‌ఫెడ్, మార్కెటింగ్‌ శాఖల ద్వారా మూడున్నరేళ్లలో 4.27 లక్షల మంది రైతుల నుంచి రూ.7,157 కోట్ల విలువైన 20.18 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్‌లో పత్తి, మొక్కజొన్న, సజ్జ, వేరుశనగను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభం నుంచి పత్తి, మిరప, మినుము, వేరుశనగ, సజ్జలు, మొక్కజొన్న, పెసల ధరలు రికార్డు స్థాయిలో ఉండగా పసుపు, శనగ, సన్‌ఫ్లవర్‌ సీడ్‌ ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూ ఇటుగా ఉన్నాయి.

రికార్డు స్థాయి ధరలు
అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా కర్నూలు మార్కెట్‌లో గరిష్టంగా రూ.37 వేలు, గుంటూరు యార్డులో రూ.30 వేలకు పైగా ఉండటం గమనార్హం. నల్లతామర పురుగుతో గతేడాది మిరప దెబ్బతినగా ఈ దఫా ఆ ప్రభావం పెద్దగా లేదు. మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయిలో ఉండడంతో రైతన్నలు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటాల్‌ రూ.6,380 కాగా రూ.7,659, మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,080 కాగా రూ.7,359 పలుకుతోంది.

ఈ సీజన్‌లో గరిష్టంగా రూ.9,500 పలికింది. మిగిలిన పంటలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. అపరాలకు కూడా ప్రస్తుత సీజన్‌లో మంచి రేటు లభిస్తోంది. మినుము ఎమ్మెస్పీ రూ.6,600 కాగా ప్రస్తుతం రూ.8,400కిపైగా పలుకుతోంది. పెసలు ఎమ్మెస్పీ రూ.7,755 కాగా ప్రస్తుతం రూ.8 వేలు దాటింది. కందులు ఎమ్మెస్పీ రూ.6,300 కాగా ప్రస్తుతం రూ.7,500 పలుకుతోంది. మొక్కజొన్న ఎమ్మెస్పీ రూ.1,860 కాగా మార్కెట్‌లో రూ.2,600 ఉంది. వేరుశనగ ఎమ్మెస్పీ రూ.5,850 కాగా ప్రస్తుతం రూ.7 వేలు పలుకుతోంది. సజ్జలు ఎమ్మెస్పీ రూ.2,350 కాగా ప్రస్తుతం రూ.2,600 చొప్పున గరిష్ట ధర లభిస్తోంది. ఉల్లి ఎమ్మెస్పీ రూ.770 కాగా ప్రస్తుతం మార్కెట్‌లో రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పలుకుతోంది.

మార్కెట్‌ ఆశాజనకం
మార్కెట్‌ చాలా ఆశాజనకంగా ఉంది. మిరప, పత్తి, మొక్కజొన్న, అపరాలు, సజ్జలు మినహా చిరుధాన్యాలు ఎమ్మెస్పీ మించి ధర పలకడం శుభ పరిణామం. నిరంతరం సీఎం యాప్‌ ద్వారా ధరలను పర్యవేక్షిస్తున్నాం. రానున్న రోజు­ల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు కనిపి­స్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతు­లకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
– రాహుల్‌ పాండే, కమిషనర్, మార్కెటింగ్‌ శాఖ 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top