సాక్షి, అమరావతి: ఆపరేషన్ కగార్ కారణంగా ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా మృతి చెందారు. దీంతో, మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, తాజాగా హిడ్మా.. ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ తాజాగా బయటకు వచ్చింది. అందులో కీలక విషయాలను వెల్లడించారు.
మావోయిస్టు కీలక నేత హిడ్మా.. గత కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లో ఉన్న ఒక జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని నవంబర్ 10న జర్నలిస్ట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది’ అని లేఖలో రాసుకొచ్చాడు.
ఇదిలా ఉండగా, హిడ్మా లేఖపై తాజాగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పందిస్తూ.. హిడ్మా లేఖ రాసిన విషయం మాకు తెలియదు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడు. అతడిని పట్టుకుని చంపామనేది అసత్యం. లొంగిపోయేందుకు వచ్చిన ఎవరినీ ఎన్‌కౌంటర్ చేయలేదు. ఎన్‌కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చు. మావోయిస్టులు లొంగిపోవాలి’ అని సూచించారు.


