పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్య! | Man commits suicide at police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్య!

Apr 20 2026 4:55 AM | Updated on Apr 20 2026 4:55 AM

Man commits suicide at police station

మృతుడు వెంకట సుబ్బయ్య

లాకప్‌డెత్‌ అంటూ ఆరోపణలు – రూ.15 లక్షలకు సెటిల్‌మెంట్‌! 

సాక్షి టాస్క్ ఫోర్స్‌: చోరీ కేసులో పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తి స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారు జామున నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో జరిగింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, లాకప్‌ డెత్‌ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకట సుబ్బయ్య(38) ఈనెల 16న తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా పడగటూరు గ్రామానికి చెందిన తేజ, నరేష్  తో కలిసి బెలుం గ్రామంలో రెక్కీ నిర్వహించి కొత్త ట్రాక్టర్‌ను అపహరించుకుపోయాడు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కర్నూలు సమీపంలో ట్రాక్టర్‌ ఉండటంతో రికవరీ చేశారు. ఈ కేసులో వెంకటసుబ్బయ్య, తేజను అదుపులోకి తీసుకోగా నరేష్‌ పరారీలో ఉన్నాడు. మృతుడు వెంకటసుబ్బయ్యపై పోలీస్‌ స్టేషన్‌లో దొంగతనం, రెండు కొట్లాట కేసులు ఉన్నాయి.  

బాత్రూంలో మృతి  
ట్రాక్టర్‌ దొంగతనం కేసులో వెంకటసుబ్బయ్యను  పోలీసులు శనివారం ఉదయమే కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఆదివారం కోర్టులో హాజరు పర్చాలని భావించారు. తెల్లవారు జామున స్టేషన్‌లోని బాత్‌రూం వెళ్లి కట్టుకున్న లుంగీతో వెంకటసుబ్బయ్య ఉరివేసుకున్నాడు. బాత్‌రూంకు అని చెప్పి వెళ్లి ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి దొంగ తేజ రాత్రి విధుల్లో ఉన్న పోలీసులకు చెప్పాడు. వారు వెళ్లి చూడగా సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. 

శ్వాస ఇంకా ఉందనే అనుమానంతో  సిబ్బంది అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బయ్యపై మూడు కేసులు ఉండటంతో పాటు తాజాగా ట్రాక్టర్‌ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో చేతులు కలపడంతో రిమాండ్‌కు వెళ్లాల్సి వస్తుందనే కారణంతోనే భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నంద్యాల ఏఎస్పీ మంద జావళి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని వివరాలు సేకరించారు.  

మృతిపై అనుమానాలెన్నో! 
వెంకటసుబ్బయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దెబ్బలు తాళలేకనే మృతిచెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాత్రూంలో ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. 

సెటిల్‌మెంట్‌ చేశారా? 
వెంకటసుబ్బయ్య అధికార పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా సెటిల్‌మెంట్‌ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు ఎందుకు బేరమాడారనేది చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే వెంకటసుబ్బయ్య కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకోలేదని లాకప్‌ డెత్‌ జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement