టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ జరపాలి

The longest zero hour in the legislature - Sakshi

శాసనసభలో సుదీర్ఘంగా సాగిన జీరో అవర్‌

నియోజకవర్గాల సమస్యలపై స్పందించిన 46 మంది సభ్యులు 

ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి విడిపించి, పేదలకు ఇవ్వాలని వినతి

సాక్షి, అమరావతి: శాసన సభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ‘జీరో’అవర్‌ సుదీర్ఘంగా సాగింది. రెండున్నర గంటలకు పైగా 46 మంది శాసన సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడారు. జీరో అవర్‌ను ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నడిపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన భూకబ్జాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు, లోకేశ్‌ వారి పర్యటనల్లో అధికార పక్ష నాయకులపై భూ కబ్జా ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. టీడీపీ హయాం నుంచి ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో సమగ్ర విచారణ చేయించాలి కోరారు. దీనిపై ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి స్పందిస్తూ.. ‘నేను ఇప్పు డు చైర్‌లో కూర్చున్నా. లేకుంటే శాసన సభ్యుడినే కదా. రెండు నెలల కిందట చంద్రబాబు విజయనగరంలో నాపైనా ఆరోపణలు చేశారు.

ఏ భూములైతే ఆక్రమించానని ఆరోపిస్తున్నారో.. ఆ భూముల్లో చంద్రబాబు కూర్చుని ఆందోళన చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పాను. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోపణలపై విచారణకు ఆదేశించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి వి డిపించి అర్హులైన పేదలకు ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను త్వరితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

లోకేశ్‌ కబ్జా ఆరోపణలపై విచారణ చేయించాలి:  ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
పీలేరులో టీడీపీ నేత లోకేశ్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆక్రమించుకున్నామని లోకేశ్‌ ఆరోపించారన్నారు.

గతంలో తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, 2014–19 మధ్య ఎంత భూమి మింగేశారు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఎంత కబ్జాకు గురైందో సీఐడీ, విజిలెన్స్‌ ద్వారా విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. తాను ఏనాడూ ప్రభుత్వ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు.

పేజ్‌కు భూ కేటాయింపులపై వాస్తవాలు నిగ్గు తేల్చాలి
టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా పేజ్‌ ఇండస్ట్రీకి 28 ఎకరాలు కారు చౌకగా ఎకరం రూ.10 లక్షలకు కేటాయించడంపై విచారణ జరపాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అక్కడ ఎకరం రూ.4 కోట్లు ఉంటుందని, రూ.110 కోట్ల విలువైన స్థలాన్ని రూ.2.80 కోట్లకే  రిజిస్టర్‌ చేశారని చెప్పారు. మూడేళ్ల తర్వాత భూమిని విక్రయించుకోవచ్చని జీవో కూడా ఇచ్చారన్నారు.

2016లో భూమి ఇస్తే 2019 వరకు ఆసంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేదన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ హయాంలో రామగిరిలో రూ.1000 కోట్ల విలువైన గ్రానైట్‌ను ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా తరలించారని అన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో భూ యాజమాన్య మార్పులు చేసే వెసులుబాటుతో అనంతపురం రూరల్, రాప్తాడు నియోజకవర్గంలో వందల కోట్లు విలువ చేసే భూముల్లో బినామీల పేర్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేశారని, ఇలాంటి దోపిడీల్లో ప్రభుత్వం వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు.

బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టాలి
సరైన గుర్తింపు లేని బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టి ప్రభుత్వ పథకాలు అందించాలని కొందరు సభ్యులు కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని.. కేంద్ర కేబినెట్‌ ఆమోదంతో పార్లమెంట్‌ చట్ట సవరణ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. బుడగ జంగాలు ఏ వర్గంలోకి వెళ్లాలనుకుంటున్నారో సంబంధిత కమిషన్‌కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top