కొత్త వైద్య కళాశాలల్లో.. 

Large platform for hospital buildings in AP - Sakshi

ఆస్పత్రి భవనాలకే పెద్దపీట

అవి పూర్తికాగానే పేషెంట్లకు సేవలు

ఆ తర్వాతే మెడికల్‌ కాలేజీల నిర్మాణం

ఇప్పటికే నాలుగు వైద్య కళాశాలలు, ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులకు టెండర్లు పూర్తి

బీఆర్‌ఓ కోసం మరో 12 కాలేజీలు నిరీక్షణ

ఏప్రిల్‌ చివరి వారంలో పనులు ప్రారంభం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న 16 వైద్య కళాశాలల్లో ముందుగా ఆస్పత్రుల నిర్మాణాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటిని పూర్తిచేసిన అనంతరమే వైద్య కళాశాలల నిర్మాణాలు చేపడతారు. ఈ మేరకు రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. మరోవైపు.. పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు వైద్య కళాశాలలకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే జరిగే ఒప్పందాల అనంతరం ఏప్రిల్‌ మొదటి వారంలో పనులు మొదలుపెడతారు. అలాగే, ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు.. కడపలో మెంటల్‌ హెల్త్, క్యాన్సర్‌ బ్లాక్‌ ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వీటన్నింటి పనులు ఏప్రిల్‌లో మొదలు పెట్టి ఏడాదిన్నరలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

బీఆర్‌ఓ కోసం నిరీక్షణ
మిగిలిన 12 మెడికల్‌ కాలేజీల డిజైన్లను అధికారులు ఖరారు చేశారు. బీఆర్‌ఓ (బడ్జెట్‌ రిలీజింగ్‌ ఆర్డర్‌) రాగానే వీటికీ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. అలాగే, ప్రస్తుతమున్న 11 వైద్య కళాశాలల్లో నాడు–నేడు పనుల కింద చేపట్టే పనులకు కూడా త్వరలో టెండరు ఆహ్వానించనున్నారు. దీంతో వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో బోధనాసుపత్రుల రూపురేఖలే మారనున్నాయి.

సకాలంలోనే పూర్తవుతాయి
మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం నిర్దేశించారు. అప్పటిలోగా వాటిని పూర్తిచేస్తాం. పేషెంట్లకు వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ముందుగా ఆస్పత్రి భవనాలు నిర్మిస్తాం. ఇప్పటికే ఐదు స్పెషాలిటీ ఆస్పత్రులు, నాలుగు వైద్య కళాశాలల టెండర్లు పూర్తయ్యాయి. మిగతావీ త్వరలోనే పూర్తిచేసి పనులకు వెళ్లబోతున్నాం.
– విజయరామరాజు, ఎండీ, ఏపీఎంఎస్‌ఐడీసీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top