పొగమంచుతో విమానాలకు ల్యాండింగ్‌ కష్టాలు

Landing difficulties for planes due to fog - Sakshi

విమానాశ్రయం (గన్నవరం): దట్టమైన పొగమంచు రన్‌వే ప్రాంతాన్ని పూర్తిగా కప్పి వేయడంతో గన్నవరం విమానాశ్రయంలో గురువారం విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత హైదరాబాద్‌ నుంచి ఉదయం 7.35 గంటలకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై దిగేందుకు విజిబిలిటీ లేకపోవడంతో 40 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది.

అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సూచన మేరకు విమానం తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. ఉదయం 8.15 గంటలకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది.

ఒకసారి రన్‌వేపై విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికి విజిబిలిటీ లేకపోవడంతో టేకాఫ్‌ తీసుకున్నారు. మరో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్‌ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పొగమంచు ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్‌ తిరిగి వెళ్లిన ఇండిగో విమానం కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకి ఉదయం 10 గంటలు దాటిన తరువాత చేరుకుంది.

ఫాస్టాగ్‌ సేవలు ప్రారంభం
గన్నవరం విమానాశ్రయంలోని టోల్‌గేట్‌లో ఫాస్టాగ్‌ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయాల్లో టోల్‌గేట్‌ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చారు. టోల్‌గేట్‌ వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న విమానాశ్రయ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ పీవీ రామారావు ఈ సేవలను ప్రారంభించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top