
శ్రామికనగర్ లేఅవుట్‌లో నిరి్మంచిన ఇళ్లను కూల్చివేస్తున్న పొక్లెయిన్
శ్రామికనగర్‌లో ఇళ్లు కూల్చివేత
2006లో వేసిన లేఅవుట్‌లో కొన్న ప్లాట్లలో ఇళ్లు కట్టుకున్న సామాన్యులు
జనసేన నేత వేములపాటి అజయ్‌కు వాటా ఉందని లేఅవుట్ స్వాదీనానికి యత్నాలు
వందమందికిపైగా రౌడీమూకలతో విధ్వంసం
యంత్రాలు తీసుకొచ్చి మరీ మూడిళ్లు ధ్వంసం
నెల్లూరు సిటీ: కూటమి నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. రౌడీమూకలు పేట్రేగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం శ్రామికనగర్‌లో జనసేన గూండాలు సోమవారం అరాచకం సృష్టించారు. తినీతినక రూపాయిరూపాయి పోగేసి సామాన్యులు కట్టుకున్న ఇళ్లను యంత్రాలు తీసుకొచ్చి మరీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే శ్రామికనగర్‌లో 3.9 ఎకరాల స్థలంలో బెల్లంకొండ తిరుపాల్ అనే వ్యక్తి ఎకరన్నరం పొలంలో లేవుట్ వేశారు.
అప్పట్లో 10 మంది భూమిని విభజించుకుని కొన్నారు. ఆ తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలు 40 మంది వరకు ఆ లేఅవుట్లోని ప్లాట్లను కొని రిజి్రస్టేషన్లూ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మీడియా చైర్మన్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్, మరో ఐదుగురు ఈ లేఅవుట్ వేసిన భూమి తమదంటూ హద్దురాళ్లు ఏర్పాటు చేసే యత్నం చేశారు. ప్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ఆ తర్వాత మిన్నకుండిపోయారు.
ఈ క్రమంలో రెండుమూడు నెలలుగా దశలవారీగా అర్ధరాత్రుళ్లు నిర్మాణ దశలో ఉన్న నాలుగు ఇళ్లను దుండగులు కూల్చేశారు. ఎవరి పనో తెలీక నిర్మాణదారులు అయోమయపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన గూండాలు పేట్రేగిపోయారు. జనసేన నేత నూనె మల్లికార్జున్‌యాదవ్ కుమారుడు తన అనుచరులు, రౌడీమూకలు, యంత్రాలతో వచ్చి లేఅవుట్‌లో వేసిన మరో మూడు ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు.
112 ద్వారా కంట్రోల్‌రూం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి కూల్చివేతలను ఆపాలని ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన గంట తర్వాత జనసేన రౌడీలు మూడు ఇళ్లను నేలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డునూ మూసివేస్తూ అప్పటికప్పుడు గోడ కట్టేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేఅవుట్‌లోనే కాపుగాశారు. అక్కడే మద్యం తాగుతూ హల్‌చల్ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే బాధితులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే రౌడీమూకలు గోడలు దూకి పరారయ్యారు. ప్రధాన పాత్ర వహించిన కొందరిని పోలీసులు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.