తెలిసి తెలిసి బొంకిన బాబు! | KSR Comments On Chandrababu Naidu Comments 4 Children | Sakshi
Sakshi News home page

తెలిసి తెలిసి బొంకిన బాబు!

May 20 2026 11:14 AM | Updated on May 20 2026 11:34 AM

KSR Comments On Chandrababu Naidu Comments 4 Children

అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నేర్పరి. ఆచరణ సాధ్యం కాని విషయాలను కూడా సులువుగా ప్రచారంలో పెట్టేయగలరు. అధిక సంతానం విషయమే తీసుకోండి. డైవర్షన్‌ కోసం చేస్తున్నారా? లేక ప్రజలను మభ్యపెట్టేందుకా? అన్నది తెలియదు కానీ తన ప్రతిష్టను సైతం పట్టించుకకుండా ఆయన ముగ్గురు పిలల్ని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు అని ఒక ట్యాగ్‌లైన్‌ పెట్టేసుకున్నారు. ఇదేం పిచ్చిగోల అని మనకు అనిపించవచ్చు కానీ ఆయన లక్ష్యం వేరు. బాబుగారు గొప్ప సిద్ధాంతకర్త, విజన్‌ ఉన్న వాడు అని జనాలు అనుకోవాలన్నది ఆయన ఫీలింగ్‌ కావచ్చు. అయితే.. ఈ సారి చంద్రబాబు వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆక్షేపణ వ్యక్తమవుతోంది. అంతమంది పిల్లల్ని కనడానికి ఆడవారేమైనా యంత్రాలా?అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు ఇస్తానని చెబుతున్న మొత్తం డైపర్లకు కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా పేరు ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా పుట్టిన పిల్లల ఆహారం, మందులు, చదువు, పెంపకం ఖర్చులు కూడా ప్రభుత్వం చూసుకుంటుందా అని ప్రశ్నించారు. ప్రజలకు కావల్సింది జీవన భధ్రత తప్ప పతాక శీర్షికల్లోకి ఎక్కే స్కీములు కావని ఎద్దేవ చేశారు. సినీనటి పూనమ్ కౌర్ కొంచెం భిన్నంగా స్పందిస్తూ.. ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృస్టిలో పెట్టుకుని ముందు లోకేశ్‌ ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆశిద్దాం అని వ్యాఖ్యానించారు. 

మాజీ పోలీస్ ఉన్నతాధికారి కిరణ్ బేడీ మహిళలు తమ అత్యంత ఉత్పాదక జీవిత కాలాన్ని ముగ్గురు, నలుగురు  పిల్లలను కనడం, పెంచడానికే వినియోగించాలన్న భావన సరైనదేనా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబుది ఫ్యూడల్ భావజాలంగా ఆమె అభిప్రాయపడ్డార అన్నమాట. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు చెబుతున్న రూ.ముప్పైవేలు బారసాల ఖర్చులకైనా వస్తాయా? అని అడిగారు. మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పేర్నినాని, అంబటి రాంబాబు తదితరులు చంద్రబాబు తన కుటుంబంలో దీనిని ఆచరించి చూపించాలని సూచించారు.  ఈ విమర్శల మాటెలా ఉన్నా... చంద్రబాబుకు ఇవన్నీ తెలియని అమాయకుడేమీ కాదు. 

ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా ప్రజల దృష్టి.. విపక్షాల చర్చ ఇతర సమస్యలవైపు వెళ్లకుండా ఉంటుందన్నది ఆయన అంచనా. సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా సంతానోత్పత్తి గురించి ఆలోచించాలన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన  వాగ్దానం ఏమిటో ప్రజలకు గుర్తుకు రాకూడదన్నమాట. అప్పట్లో రాష్ట్ర  ప్రభుత్వం వేస్తున్న పన్నులను తగ్గించి చమురు ధరలు పెరగకుండా చూస్తామని గొప్పలకు పోయారు. అది సాధ్యం కాదని వారికి ఆనాడే తెలుసు. అయినా తన కుమారుడు లోకేశ్‌తో కలిసి జనాన్ని నమ్మించే యత్నం చేశారు. తాను సంపద సృష్టిస్తానని  ప్రతి సభలోను జనం చెవులు దద్దరిల్లేలా ప్రచారం చేశారు.  

తీరా అధికారం వచ్చాక సంపద సృష్టించే మార్గాలు  ఉంటే తనకు చెవిలో చెప్పాలని జనాన్ని కోరారు. గల్లా పెట్టె ఖాళీగా ఉందని చేతులెత్తేశారు. తాజాగా అసలు సంపద సృష్టి మీ చేతిలోనే ఉందని, అది పిల్లలను కనడమేనని చెప్పి ప్రజలందరిని అమాయక గొర్రెలుగా మార్చారన్నమాట. నిజానికి సంపద సృష్టి తన చేతిలో లేదని ఆయనకు ఎన్నికల ముందు కూడా బాగా తెలుసు.  అయినా ఎన్నికలలో జనాన్ని మభ్య పెట్టడానికి అలాంటి డైలాగులు చెప్పాలి. సోషల్  మీడియాలో, ఎల్లో మీడియాలో విపరీత ప్రచారం చేయాలి.తద్వారా చంద్రబాబు ఏదో చేసేస్తారన్న భావన కలిగించాలి. ఒట్లు  దండుకోవాలి.ఇదే  లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారు. ఇలా ఒకటి కాదు.. 2014 ఎన్నికలలో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని తెగ చెప్పారు.అదెలా సాధ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రశ్నించినా, చంద్రబాబు కు ఆ మాజిక్ తెలుసునని టీడీపీ వారు వాదించేవారు. 

వాస్తవానికి చంద్రబాబుకూ తెలుసు తాను చేస్తున్నది తప్పుడు వాగ్దానం అని. బ్యాంకులలో ఉన్న  బంగారు నగలను కూడా విడిపించి ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారంటేనే అది మోసపూరితమైన హామీ అన్న సంగతి ఎంతో విజన్ ఉందని చెప్పుకునే ఆయనకు తెలియదా! రైతుల ఆశను ఆయన క్యాష్ చేసుకున్నార అన్నమాట..ఓట్లు  వేశారు. ఆ తర్వాత మరీ ఇంత ఆశపోతులుగా ఉంటారా అని వారినే ఎద్దేవ చేశారు. సూపర్ సిక్స్ లో ఉన్న హామీలు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 చొప్పున ప్రతి మహిళకు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. అయినా వారిని బురిడి కొట్టించాలంటే ఇదొక్కటే మార్గం అనుకున్నారు. చెప్పేశారు. అధికారం వచ్చాక దాని ఊసే ఎత్తలేదు.మంత్రి అచ్చెన్నాయుడు దానిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని  అమ్మాలని జనానికి చెప్పారు. పేదరికం లేకుండా చేసేస్తాననంటూ  ప్రగల్బాలు  పోయారు. తదుపరి ధనికులు పేదలను దత్తత తీసుకుంటే సరి అని కొత్త సూత్రం చెప్పేసి చేతులు దులుపుకున్నారు.

నిరుద్యోగ భృతి మూడువేలు చొప్పున ఇస్తామని చెప్పారు.  గత టరమ్ లో కూడా ఆయన చెప్పినా చేయలేదు. అయినా మళ్లీ అదే వాగ్దానం చేశారు.అధికారంలోకి వచ్చాక 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ  కాకి లెక్కలు చెప్పి సరిపెట్టుకోమంటున్నారు.ఈ రకంగా చెప్పుకుంటూ  పోతే  అది చాంతాడంత జాబితా అవుతుంది. పిల్లలను  కనండని ఎందుకు చెబుతున్నారు. జనాభా తగ్గుతోందన్న కారణంగా ఆయన  అంటున్నారని అనుకుంటే పొరపాటే.కేవలం ఇదొక భావజాలంగా మార్చి జనాన్ని ఏమార్చాలి.  దక్షిణాదికి నిధులలోనే కాక,లోక్ సభ సీట్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఈ రాష్ట్రాలలో  వివిధ రాజకీయ పక్షాలు  ఆందోళన చెందుతున్నాయి. గతంలో చంద్రబాబు  కూడా ఈ విషయంలో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడేమో ప్రధాని  మోడీని ప్రశ్నించే ధైర్యం ఆయనకులేదు.అందువల్ల దానికి బదులు పిల్లలను కనండి అని సలహా ఇచ్చి ఏపీ జనాన్ని అటువైపు మళ్లిస్తే సరిపోతుందని అనుకున్నారనుకోవాలి. 

ఆర్ఎస్ఎస్ వారి మెప్పుదల కూడా వస్తుందని భావించి ఉండవచ్చు.అయితే విశ్వహిందూపరిషత్ నాయకుడు ఒకరు మాత్రం ఈ స్కీమ్ కేవలం హిందువులకే అమలు చేయాలని మెలిక పెట్టారు. అది వేరే సంగతి.  ఈ మొత్తం ఏపీసోడ్ లో ఇబ్బంది పడుతున్నది ఎవరయ్యా  అంటే అది ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ముందుగా ఆయనను పిల్లలను కనమనండి అని మహిళా నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.ఇది లోకేష్ కు  ఎంబరాస్ మెంట్ గానే ఉంటుంది. బహుశా దానివల్లనేమో ఇంతవరకు ఈ సంతానోత్సత్తి అంశంలో  తండ్రి ప్రతిపాదనపై  లోకేష్ స్పందించలేదు.ప్రచారం ఆరంభించలేదు.ఇంకో మాట చెప్పాలి. ముందుగా మొదటి ఇద్దరు పిల్లలకు ఎందుకు ప్రోత్సహాం ఇస్తానని అనడం లేదు?దాంతోనే ఈయన  ఏదో ప్రచారం కోసం అంటున్నారులే  అన్నభావన కలగదా!పిల్లలు  కనడం అన్నది వ్యక్తిగత విషయం.వారి ఆర్ధిక స్తోమతను బట్టి ,వారి ఇతర సమస్యలను  బట్టి ఉంటుంది. 

చంద్రబాబు కనమంటే కనడం,వద్దంటే  కనకపోవడం ఉండదు.ఆ సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు.ఒకవేళ చంద్రబాబు చెప్పారు  కదా అని ఎవరైనా అమాయకంగా ఎక్కువ మంది పిల్లలను  కనడం ఆరంభిస్తే వచ్చే సమస్యలను వివరిస్తూ ఒక పిల్లల డాక్టర్ చేసిన  వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.చంద్రబాబు  మాటలను పట్టించుకోవద్దని ఆమె సూచించారు.  చంద్రబాబు దృష్టిలో ఏపీ ప్రజలు మరీ అమాయక గొర్రెలుగా కనిపిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ది ఉంటే మూడో బిడ్డను కంటే  నెలకు ముప్పైవేలు ఇస్తామని చెప్పగలరా?లేదా 30 లక్షల  డిపాజిట్ చేస్తామని గ్యారంటీ ఇవ్వగలరా?పెళ్లి చేసుకుంటే లక్షరూపాయల  కానుక ఇస్తామని చెప్పిన పెద్దలు ఎంతమేర దానిని ఆచరించారు?ప్రస్తుతానికి చంద్రబాబు  చెబుతున్నవి ఉబుసుపోక కబుర్లుగానే అంతా పరిగణిస్తున్నారు.కాకపోతే ముఖ్యమంత్రి  హోదాలో ఉండి ఇలా అప్రతిష్ట తెచ్చుకోవడం అవసరమా?

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement